- పెళ్లి పేరుతో లక్షలు కొల్లగొట్టిన యువకుడు..
ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన ఓ యువకుడు మ్యాట్రిమోనీలో యూకేలో స్థిరపడిన అమ్మాయి నంటూ అవతారం ఎత్తి నకిలీ ప్రొఫైల్‌ను మ్యాట్రిమోనీలో అప్‌లోడ్ చేశాడు. పెళ్లి పేరుతో అమాయకులను వలలో వేసుకుని లక్షలు కొల్లగొట్టాడు. బాధితుడి ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీస్ జారీ చేసి నిందితుడు చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. శుక్రవారం నగరానికి తరలించారు. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.
నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి ఒక విదేశీ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. తన పేరు అంజలి కందుల అని, మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చూశాను. నాకు నచ్చింది అని పరిచయం చేసుకున్నాడు. తాను యూకే ఇంజనీర్‌గా పనిచేస్తూ స్థిరపడిన సంపన్నురాలిగా చెప్పుకొన్నాడు. ‘అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుందాం.. మీరు కూడా పెళ్లికి ముందే రూ. కోట్లు సంపాదించే మార్గం నా దగ్గర ఉంది. మా అంకుల్ ఫారెక్స్, ట్రేడింగ్‌లు చేస్తుంటాడని సదరు ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు పెడితే రూ. కోట్లు సంపాదించొచ్చు..’ అని అతన్ని నమ్మించాడు..
ప్రారంభంలో చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టిన బాధితునికి వర్చువల్‌గా రూ.12.5లక్షలు లాభాలు వచ్చినట్లు చూపించారు. వాటిని విత్‌డ్రా చేయాలంటే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించారు. అలా అతని ద్వారా రూ. 11,17,834 పెట్టించారు. ఆ తర్వాతఎంత ప్రయత్నించినా విత్‌డ్రా కాలేదు.
అంజలి కూడా అందుబాటులోకి రాకపోవడంతో అనుమానించి బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించగా.. అతను విశాఖ నుంచి ఉద్యోగం కోసం కంబోడియాకు వెళ్లిన పెద్దపూడి ప్రసన్న కుమారన్‌గా తేలింది.
