ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండల పరిధిలోని కాగజ్ ఘాట్ గ్రామంలో నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నాటు కోళ్ల ఫామ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ దొంగతనానికి పాల్పడ్డారు. యార సత్తయ్య బావి సమీపంలో ఉన్న నాటు కోళ్ల ఫామ్ నుంచి 200కు పైగా నాటు కోళ్లను దొంగిలించి తీసుకెళ్లినట్లు ఫామ్ యజమాని తెలిపారు.
ఉదయం ఫామ్ వద్దకు చేరుకున్న యజమాని కోళ్లు కనిపించకపోవడంతో వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మంచాల పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. దొంగతనం జరిగిన విధానంపై వివరాలు సేకరిస్తూ, చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఘటనతో రైతులు, పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దొంగతనాలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పోలీస్ పహారా పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
