Friday, March 13, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంMarredpally | బయటపడ్డ మారేడ్‌పల్లి భూ మాఫియా బండారం

Marredpally | బయటపడ్డ మారేడ్‌పల్లి భూ మాఫియా బండారం

  • హైకోర్టు తీర్పు తర్వాత కూడా నకిలీ పత్రాల సృష్టి..
  • కోట్ల విలువైన 39.12 ఎకరాల పట్టా భూమిపై కబ్జా ఆరోపణలు
  • ఫోర్జరీ డాక్యుమెంట్లతో జరుగుతున్న నిర్మాణాలు..
  • బీఎనఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు..
  • మారేడ్ పల్లిలో సంచలనం సృష్టిస్తున్న భూమి కబ్జా వ్యవహారం

సికింద్రాబాద్ లోని మారేడ్‌పల్లి పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిలో నకిలీ పత్రాల ఆధారంగా అక్రమ కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర సంచలనాన్ని రేపుతున్నాయి. సర్వే నంబర్ 74లో దాదాపు 306 ఎకరాల 15 గుంటల పట్టా భూమి విషయంలో సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని ఆక్రమిస్తు న్నారని అసలు వారసులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.

సుదీర్ఘ న్యాయపోరాటం – పట్టా భూమి అని
స్పష్టం చేసిన హైకోర్టు :

మారేడ్‌పల్లి మండలంలోని సర్వే నంబర్ 74 భూమిపై గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ వివాదం లేవనెత్తింది. దీనిపై ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద స్పెషల్ కోర్టులో (ఎల్‌జీసి నెం.167/1997) సుదీర్ఘ విచారణ జరిగింది.2010లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన తీర్పులో సబ్ డివిజన్ సర్వే నంబర్ 74/10లోని 39 ఎకరాల 31 గుంటల భూమి దిల్దార్ అలీ ఖాన్ పేరుపై ఉన్న పట్టా భూమి అని స్పష్టంగా పేర్కొంది.

- Advertisement -

ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం రిట్ పిటిషన్ నెం.19106/2010ను హైకోర్టులో దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డబుల్ బెంచ్ 2025 మే 28న తుది తీర్పు వెలువరించింది.

హైకోర్టు తీర్పు ప్రకారం.. సర్వే నంబర్ 74/1లోని మూడు ఎకరాల ఒక గుంట మాత్రమే ప్రభుత్వ భూమిగా నిర్ధారించింది. 74/2 నుండి 74/13 వరకు ఉన్న మిగిలిన భూమిని పట్టా భూమిగా ధృవీకరించింది. కాగా సర్వే నంబర్ 74/10లోని 39 ఎకరాల 12 గుంటల భూమి దిల్దార్ అలీ ఖాన్ వారసులదే అని కోర్టు స్పష్టం చేసింది.

నకిలీ డాక్యుమెంట్లతో భారీ మోసం :

కోర్టు తీర్పుతో భూమి యాజమాన్యంపై స్పష్టత వచ్చినప్పటికీ, కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలను సృష్టించి, భూమిని కబ్జా చేస్తున్నారని అసలు వారసులు ఆరోపిస్తున్నారు. మరనూరి ఆళ్వార్‌స్వామి నుంచి ఒక ఎకరం 23 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు బోగస్ పత్రాలు సృష్టించి (డాక్యుమెంట్ నెం.720/2020) అక్రమంగా భూమిని ఆక్రమించారని వారు ఆరోపిస్తున్నారు. ఆ భూమిని వారి వారసులు మరనూరి శ్రీకాంత్ ద్వారా “హరి నాం ప్రచార సమితి” కి లీజుకు ఇచ్చి గోశాల నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదే విధంగా డి. జగన్‌మోహన్ రెడ్డి, వి.వి. ప్రసాద్ రాజు ఇతరుల నుంచి కొనుగోలు చేసినట్లు మరో నకిలీ వాల్యుయేషన్ డాక్యుమెంట్ (నెం.474/ఈ–ఐఎంపి/2015) సృష్టించి 9 ఎకరాల 20 గుంటల భూమిని ఆక్రమించారని ఆరోపిస్తున్నారు. ఈ భూమిపై డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు చేసుకుని మహాలక్ష్మి కన్స్ ట్రక్షన్స్ ద్వారా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తూ, అమాయక ప్రజలకు ఫ్లాట్స్ విక్రయిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు..

రెవెన్యూ రికార్డుల్లో లేని పార్టిషన్! :

రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమిపై ఎలాంటి పార్టిషన్ డీడ్ జరగనప్పటికీ, అక్రమార్కులు తొమ్మిది ఎకరాల 20 గుంటల భూమి భాగాలుగా విభజించబడినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక తహసిల్దార్ కూడా డబ్ల్యూపి నెం.9707/2020లో హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో ఫోర్జరీ, అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అని పేర్కొన్నట్లు సమాచారం. ఇదే సమయంలో మహాలక్ష్మి నిర్మాణ సంస్థ జీహెచఎంసీకి సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు లింక్ డాక్యుమెంట్లు లేకుండా అనుమతులు ఇవ్వలేమని పేర్కొంటూ వారి అప్లికేషన్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

బీఎనఎస్ చట్టం కింద చర్యలకు డిమాండ్ :

ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న దిల్దార్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి కబ్జాకు పాల్పడుతున్న ఎం. శ్రీకాంత్, డి. జగన్‌మోహన్ రెడ్డి, వి.వి. ప్రసాద్ రాజు తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అలాగే పోలీసులను కోరుతున్నారు.

2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎనఎస్) — 2023 చట్టం ప్రకారం.. ఫోర్జరీ.. అక్రమ భూ కబ్జా.. మోసం.. లాంటి నేరాల కింద కేసులు నమోదు చేసి, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అమాయక ప్రజలకు హెచ్చరిక :

మహాలక్ష్మి నిర్మాణ సంస్థ చేపడుతున్న నిర్మాణాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దని బాధిత కుటుంబం ప్రజలను హెచ్చరిస్తోంది.
నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్లు అమ్ముతున్నారని, ఇప్పటికే కొనుగోలు చేసిన వారు కూడా తమ రిజిస్ట్రేషన్లు చట్టబద్ధమా కాదా..? అన్న విషయాన్ని పరిశీలించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు..

అవినీతి ఆరోపణలపై మరిన్ని సంచలనాలు? :

జీహెచఎంసీ అధికారులు భారీ ముడుపులు తీసుకుని చట్టబద్ధ హక్కులు లేని వారికి నిర్మాణ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే మారేడ్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయనే అంశాలపై కూడా త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి తేనుంది

“ఆదాబ్ హైదరాబాద్” “మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

- Advertisement -
RELATED ARTICLES

Latest News