సూర్యాపేటలోని 33వ వార్డు ప్రజల బాధ వర్ణనాతీతం
కాలనీ నడిబొడ్డున 5 అంతస్తుల నారాయణ స్కూల్
వందల మంది విద్యార్థుల అరుపులతో అల్లకల్లోలం
ఆదివారాలు కూడా తరగతులే.. విశ్రాంతి కరువు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు
సూర్యాపేట ప్రతినిధి, జనవరి 11(ఆదాబ్ హైదరాబాద్): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో నారాయణ స్కూల్‌ని 5 అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ వల్ల కాలనీవాసులు(Colonists) నానా అవస్థలు(Many Problems) పడుతున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే డ్రిల్(Drill), ప్రార్థనలు(Prayers), తరగతుల(Classes) పేరుతో మొదలయ్యే శబ్ద కాలుష్యం(Sound Pollution) రాత్రి 9 గంటల వరకూ కొనసాగుతోంది. దీంతో.. ప్రశాంతంగా జీవించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. పదేళ్ల కిందట కాన్వెంట్‌గా ఉన్న ఈ పాఠశాల యాజమాన్యం మారింది.
నారాయణ సంస్థ చేతుల్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వారు ఆవేదన వ్వక్తం చేస్తున్నారు. ఎలిమెంటరీ నుంచి పదో తరగతి వరకూ వేలాది మంది విద్యార్థులు ఉండటంతో వారి అరుపులు, కేకలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయని కాలనీవాసులు తెలిపారు. ఎండ, వాన, శుభం, అశుభం అనే తేడా లేకుండా రోజంతా పిల్లల శబ్దాలతో విసిగిపోయామని, ఆదివారాలు కూడా ప్రత్యేక తరగతుల పేరుతో స్కూల్ నడిపి తమకు నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు.
రూల్స్ ఏమంటున్నాయి?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప కాలనీల మధ్యలో ఉన్నత పాఠశాలలు నిర్వహించేందుకు అనుమతి లేదు. అయితే.. విద్యా నగర్ సమీపంలోని 60 ఫీట్ల రోడ్డులో అనేక విద్యా సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పాఠశాల విద్య నుంచి వృత్తి విద్యా కోర్సుల వరకూ అన్ని రకాల విద్యా సంస్థలు అక్కడే ఉండటంతో సూర్యాపేటలో విద్యా వసతులు ఎక్కడ ఉన్నాయి? అని ఎవరైనా అడిగితే 60 ఫీట్ల రోడ్ అని చెప్పే స్థాయికి ఆ ప్రాంతం ఎదిగింది. అయినా.. కాలనీలో ఈ పాఠశాల కొనసాగుతుండటం, శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా విద్యా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు.
ఉండలేకపోతున్నాం!
నారాయణ స్కూల్ పక్కనే నివసిస్తున్న ఓ వృద్ధుడు ఇటీవల గుండె ఆపరేషన్ పొందుతున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని స్థానికులు తెలిపారు. శబ్దం తగ్గించాలని కోరినందుకే స్కూల్ సిబ్బంది ఇంటిపైకి వెళ్లి దాడి చేసినంత పనైందని ఆరోపించారు. అలాగే.. కాలేజ్ విద్యార్థులు, స్కూల్ చుట్టూ తిరుగుతూ ఇళ్లలోకి తొంగిచూడటం వల్ల తాము భయాందోళనకు గురవుతున్నామని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేయడాన్ని ప్రశ్నించినవారిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడటం పరిపాటిగా మారిందని చెప్పారు.
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని 33వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్ గౌడ్‌ను వివరణ కోరగా నారాయణ కార్పొరేట్ స్కూల్లో సౌండ్ పొల్యూషన్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయం తమ దృష్టికి రాలేదని, వార్డు ప్రజలు రాతపూర్వకంగా తనకు గానీ జిల్లా విద్యాధికారికి గానీ పోలీసులకు గానీ ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. అలా చేస్తే స్కూల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
