Tuesday, March 31, 2026
Homeహైదరాబాద్‌కుల వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది

కుల వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది

  • మంద కృష్ణ మాదిగ

దేశంలో నిజమైన సమానత్వం సాధించాలంటే ఎస్సీ హోదా అంశంపై కాకుండా కుల వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దళితులకు దేవాలయ ప్రవేశం నిరాకరించడం, మరోవైపు ఇతర మతాల్లోకి మారకుండా ఆంక్షలు విధించడం ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని మండిపడ్డారు. దళితులపై నియంత్రణలు విధించే ప్రయత్నాలు ఇకపై సహించబోమని హెచ్చరించారు.

రాజ్యాంగ రూపకల్పన సమయంలో అగ్రకులాలే క్రైస్తవులకు ప్రాతినిధ్యం వహించడం వల్ల దళిత క్రైస్తవుల హక్కులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. ఎస్సీల మత స్వేచ్ఛను పరిమితం చేసే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, ఓసీ, బీసీ క్రైస్తవులకు లేని నిబంధనలు ఎస్సీలకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగంలోని సమానత్వం, మత స్వేచ్ఛ హక్కులకు వ్యతిరేకమని విమర్శించారు.

- Advertisement -

మత మార్పిడి వల్ల అగ్రకులాల స్థితి మారకపోతే, దళితుల ఎస్సీ హోదా ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. కుల వ్యవస్థ అన్ని మతాలను ప్రభావితం చేస్తోందని, అదే దళితులపై వివక్షకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. కుల వ్యవస్థ కొనసాగితే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పూజారులుగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ, 1956లో సిక్కు దళితులకు, 1990లో బౌద్ధ దళితులకు ఇచ్చిన విధానాన్ని ఉదాహరణగా చూపించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలను ప్రస్తావిస్తూ, దళిత క్రైస్తవులు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవుల ఉద్యమాలకు ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News