Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Bhatti | పర్యావరణంతోనే నిజమైన ఆర్థికాభివృద్ధి

Bhatti | పర్యావరణంతోనే నిజమైన ఆర్థికాభివృద్ధి

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడి

రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(MCRDH)లో “గాలి నాణ్యత సూచీ మరియు గాలి నాణ్యత నిర్వహణ” అంశంపై ఏర్పాటుచేసిన సదస్సుకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతోనే నిజమైన ఆర్థిక అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణను పరిపాలనా బాధ్యతగా కాకుండా నైతిక బాధ్యతగా భావిస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పూర్తి కట్టుబాటుతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

- Advertisement -

భట్టి ఇంకా ఏమన్నారంటే..

‘ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం స్వచ్ఛమైన గాలి. నేడు తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగింది. హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఈ అభివృద్ధి గర్వకారణమే అయినప్పటికీ అదే సమయంలో మరింత బాధ్యతను మనపై మోపుతోంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధాలు కావు. అవి చేతులు కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సుస్థిర అభివృద్ధి మార్గంలో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అదే సమయంలో జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాం.

శుభ్రమైన గాలి లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదు. అది భవిష్యత్తుకు నష్టాన్ని మిగులుస్తుంది. గాలి నాణ్యత కేవలం పర్యావరణ సూచీ మాత్రమే కాదు. అది ప్రజారోగ్య సూచీ, ఉత్పాదకత సూచీ, ఆర్థిక సూచీ కూడా. 2024 State of Global Air Report సహా అంతర్జాతీయ అధ్యయనాలు ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి. గాలి కాలుష్యం ప్రపంచంలో మరణాలకు రెండో ప్రధాన కారణంగా మారింది. ఏటా 80 లక్షలకు పైగా అకాల మరణాలకు ఇది కారణమవుతుండటం ఆందోళనకర అంశం. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం గాలి కాలుష్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా 4 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. అందుకే శుభ్రమైన గాలిపై చర్చ అంటే కేవలం పర్యావరణ అంశం కాదు. అది మనుషుల జీవితాలు, ఆర్థిక బలం, సామాజిక శ్రేయస్సుపై చర్చే’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News