- ఇస్స్యూ ని డివోర్స్ చేసి రాజకీయంగా మార్చకండి..
- సూచించిన అడ్వకేట్ మాధవ రావు..
ఈ అంశాన్ని రాజకీయంగా మలచడం తగదని, నాదర్గుల్ భూములపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్థరహితమని అడ్వకేట్ మాధవ రావు అన్నారు. సోమవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉన్నట్లు వెల్లడించారు.
2011లో హైకోర్టు పిటిషనర్లను యజమానులుగా గుర్తించగా, 2015లో సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఏపీ ఐ ఐ సీ దాఖలు చేసిన అప్పీలు, అలాగే 2016లో దాఖలైన రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేయబడ్డాయని వివరించారు. కోర్టులో విచారణలో ఉన్న అంశాలను తప్పుగా ప్రచారం చేయడం సరికాదని మాధవ రావు సూచించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమి రాజా శివరాజ్ బహదూర్ వారసులకు చెందిన ప్రైవేట్ పట్టా భూమి అని తెలిపారు.

హర్ష రెడ్డి పొంగులేటి 2021 నుండి 2023 వరకు మాత్రమే కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని, ప్రస్తుతం ఆయనకు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ కోణం లో ఉన్నాయని అన్నారు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో ‘పాట్ ఖరాబ్’గా నమోదై ఉండటం వల్ల వ్యవసాయానికి పనికిరానిదిగా గుర్తించారని తెలిపారు. భూ సంస్కరణల చట్టం వర్తింపుపై అప్పీలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే నాలా అనుమతులకు సంబంధించిన అంశం కూడా సుప్రీంకోర్టులో విచారణలో ఉందని తెలిపారు.
