ఇండియా, యూరోపియన్ యూనియన్ ద్వైపాక్షిక సంబంధాల్లో(India-EU Relations) సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. మన దేశంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) మంగళవారం కుదిరింది. దీంతోపాటు సమగ్ర భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. దీన్నిబట్టి ఇది ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, ప్రజా కేంద్రీకృత సహకారాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లతో కలిసి ప్రధాని మోదీ(PM Modi) సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్షణాన్ని ఇండియా-EU సంబంధాల్లో కొత్త శకం ప్రారంభంగా అభివర్ణించారు.
నిన్న మన దేశ గణతంత్ర దినోత్సవాల్లో EU నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనంతరం జరిగిన 16వ ఇండియా-EU శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇండియా-EU సంబంధాల్లో వేగవంతమైన పురోగతి నెలకొంది. ద్వైపాక్షిక వాణిజ్యం 180 బిలియన్ యూరోలకు చేరుకుంది. ప్రస్తుతం 8 లక్షలకు పైగా భారతీయులు EU దేశాల్లో నివసిస్తున్నారు. ఈ ఒప్పందం యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలకు ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక పరిపూరకత, బలమైన వ్యక్తుల మధ్య సంబంధాలు భాగస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తాయని నొక్కి చెప్పారు.
