- కుర్తివాడ బడి.. సృష్టిస్తోంది నూతన ఒరవడి..
నేటి ప్రైవేటు పాఠశాలల హడావుడి మధ్య, ప్రభుత్వ పాఠశాలల స్థాయిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో… పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒక వెలుగురేఖలా నిలుస్తోంది. పరిమిత వనరులతోనే, అపారమైన అంకితభావంతో ఈ పాఠశాల ఉపాధ్యాయులు విద్యను పండిస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జనార్థన్, మల్లేశం, శ్రీనివాస్, లావణ్య లు కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా తామే స్వయంగా గోడలను గురువులుగా మార్చారు. అక్షరాలు, అంకెలు, చిత్రాలు, విజ్ఞాన విషయాలు, సామెతలు, నీతిపాఠాలు అన్నీ పాఠశాల గోడలపై పిల్లల మనసుల్లో నిలిచిపోయేలా చిత్రీకరించారు. ఇక్కడ ప్రతి గోడ ఒక పాఠం… ప్రతి బొమ్మ ఒక ఆలోచనకు ఆరంభం.

ఇక్కడ అమలవుతున్నది కేవలం బోధన కాదు… కృత్యాధార, వినోదాత్మక బోధన అని కూడా చెప్పక తప్పదు. చూడటం, చేయటం, ఆడటం, ఆలోచించటం ఈ నాలుగు అంశాల సమ్మేళనంతో విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. గణితం ఆటలా మారుతుంది. విజ్ఞానం అనుభవంగా మారుతుంది. భాష అభిరుచిగా మారుతుంది. పిల్లలు భయంతో కాదు, ఆనందంతో నేర్చుకుంటున్నారు. తరగతి గదిలో చిన్నవిగా ఏర్పాటు చేసుకున్న గ్రంథాలయాల్లో అనేక పుస్తకాలు విద్యార్థుల ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను, వాటి సంరక్షణను, కిచెన్ గార్డెన్ ను చూస్తే అర్థమవుతుంది ఆ మొక్కల పట్ల అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రేమ. విద్యతో పాటు క్రీడలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

ఆటల ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావనను విద్యార్థుల్లో నాటుతున్నారు. చదువు, ఆటల సమతుల్యతే నిజమైన సమగ్ర విద్య అన్న భావనను ఈ పాఠశాల ఆచరణలో చూపిస్తోంది. ప్రతిరోజు ఉదయం యోగాతో పాఠశాల తరగతులు ప్రారంభం అవుతాయి. గతేడాది నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవం మండలంలోనే హైలైట్ గా నిలిచింది. ప్రభుత్వ పాఠశాల అంటే నిర్లక్ష్యం అనే అపోహను పూర్తిగా చెరిపేసి, అంకితభావమే అసలైన మూలధనం అని నిరూపిస్తున్నారు కుర్తివాడ పాఠశాల ఉపాధ్యాయులు. వారి కృషి ఫలితంగా ఈ పాఠశాల నేడు గ్రామానికే గర్వకారణంగా మారింది. పోయినేడాది 50 ఉన్న విద్యార్థులు ఈ ఏడాది 65 కి చేరడం గమనార్హం. విజ్ఞానం నింపే గోడలతో, ఉత్సాహం నింపే క్రీడలతో కుర్తివాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రేపటి పౌరులను తీర్చిదిద్దుతున్నదన్న నమ్మకం ఆ గ్రామస్థుల మనసులో పదిలం.

గ్రామ యువత సహకారం భేష్
గ్రామంలోని యువత పాఠశాల అభివృద్ధికి అడుగడుగునా తోడ్పడుతోంది. శ్రమదానం, క్రీడా కార్యక్రమాలు, పరిసరాల పరిశుభ్రత, వనరుల కల్పనలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలకు భుజం వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతున్నాం
ప్రధానోపాధ్యాయులు మేగ్యా నాయక్
“పిల్లలకు పుస్తకాలకే పరిమితం కాకుండా జీవన నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో మేము కృషి చేస్తున్నాం. సమకాలీన పరిస్థితులను బట్టి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నాం. ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రులు, గ్రామ యువత సహకారం వల్లే మా పాఠశాల ప్రగతి సాధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచడమే మా ప్రధాన ఆశయం.”
