సేఫ్ నిధులతో సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం
కార్మిక కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తాం
ప్రజల వెన్నంటి ఉండేది కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులే
విస్తృత ప్రచారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
సింగరేణి (Singareni) కార్మికవాడల్లో, ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న మాజీ కార్మిక కుటుంబాలకు అండగా ఉంటామని కొత్తగూడెం ఎమ్మెల్యే (Kothagudem Mla) కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiva Rao) చెప్పారు. సంస్థ క్వార్టర్లలో సింగరేణి స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకొని ఉంటున్న మాజీ కార్మిక కుటుంబాలకు, కాంట్రాక్టు కార్మికులకు, సంస్థపై పరోక్షంగా ఆధారపడ్డ పేద కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మిక ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలైన గౌతంపూర్, రుద్రంపూర్, ఫోర్ ఇంకైన్, ప్రశాంతి నగర్, రామాంజనేయ కాలనీ, బాబు క్యాంప్, ఎన్కే నగర్, నందా తండా, చుంచుపల్లి పంచాయతీల పరిధిలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.
బస్తీల్లో, గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. మాజీ కార్మికులు, పేదలు, సింగరేణి కాంట్రాక్టు కార్మికులను వారు నివసిస్తున్న పాత క్వార్టర్లు, సింగరేణి స్థలాల నుంచి వెళ్లగొట్టే చర్యలకు స్వస్తి చెప్పి స్వేచ్ఛగా నివసించే వెసులుబాటు కల్పించామన్నారు. సింగరేణి సేఫ్ నిధుల(Singareni Safe Funds)తో ప్రభావిత గ్రామాల అభివృద్ధి, కార్మికవాడల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి జరిగిందని పేర్కొన్నారు. కార్మికులు, పేదల సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజల వెన్నంటి ఉండి వారి కష్టాలు, సమస్యలపై స్పందించి తీర్చేది కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులేనని కూనంనేని తెలిపారు.
ఈ నెల 14న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat Elections) సిపిఐ (CPI) బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో డబ్బు మూటలతో వచ్చే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో సిపిఐ నాయకులు సలిగంటి శ్రీనివాస్, దుర్గరాశి వెంకటేశ్వర్లు, జి.వీరస్వామి, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లిఖార్జునరావు, పొలమూరి శ్రీనివాస్, యాండ్ర మహేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
