లెక్కలు బయటపడతాయా…
విచారణ పేరుతో హడావుడి
మధ్యలోనే ఆపేసిన వైనం
అవినీతిపరులు, అధికారుల మధ్య సయోధ్య?
మెప్మా టీఎల్ఎఫ్‌లో పైకం మాయం
కొత్తగూడెం, డిసెంబర్ 8 (ఆదాబ్ హైదరాబాద్): కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation) మెప్మా పేరు చెబితే అమ్మో అవినీతి అడ్డా అన్న అపవాదును మూటకట్టుకుంది. ఆ ఆపవాదును తొలగిస్తారనుకుంటే ఇంకా అవినీతి(Corruption)కి కేరాఫ్(Care Of)గానే మారుస్తున్నారు. మోప్మాలో జరిగిన భారీ అవినీతిపై గత నెల 25న ఈసారు భలే హుషారు.. మెప్మాలో ఏం జరుగుతోంది, రూ.5 కోట్ల శ్రీనిధి పైకం ఏమైంది? రూ.3 కోట్ల బ్యాంక్ లింకేజ్ రికవరీ లేనట్లేనా? సొంత అకౌంట్‌లోకి నిధుల బదిలీ, టీఎంసీ మాయాజాలం వెనక ఉన్నది ఎవరు? అంటూ ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనంతో జిల్లా కలెక్టర్ విచారణ(Collector Inquiry)కు ఆదేశించారు. తొలుత విచారణ పేరుతో హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత విచారణను కొండెక్కించినట్లు కనిపిస్తుంది. విచారణ సా..గుతుండటంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో.. మెప్మా కథ కంచికేనా అంటూ ప్రజలతోపాటు నాయకులు వ్యంగ్యాస్త్రాలను (Leaders Satires) గుప్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ మెప్మాలో జరిగిన భారీ అవినీతి లెక్కలు బయటపడతాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలకు ప్రధాన కారణం కొంత మంది అవినీతిపరులకు, విచారణాధికారులకు మధ్య సయోధ్య కుదరటమేనన్న గుసగుసలు వినిపిస్తు న్నాయి. గతంలోనూ మెప్మాలో జరిగిన అవినీతి అక్రమాలపై అనేక మార్లు విచారణ చేపట్టి మధ్యలోనే ఆపేసిన సంఘటనల వల్ల ప్రస్తుతం అదే తరహాలో ఈ విచారణ సైతం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కొత్తగూడెంలో విధులు నిర్వహించి మణుగూరు(Manuguru)కు బదిలీ అయిన ఓఅధికారి అవినీతి బాగోతాన్ని సైతం ఆయన స్థానంలో వచ్చిన మరో అధికారి వెలికితీసేందుకు ప్రయత్నించాడని, దీంతో బదిలీపై వెళ్లిన అధికారి ఆగ్రహంతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఆ తరహాలోనే ప్రస్తుతం వచ్చిన ఆరోపణలపై సైతం కొంత మంది విచారణాధికారులపై బెదిరింపులకు దిగుతున్నట్లు విస్వశనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా అవినీతిపరులకు, విచారణాధికారులకు మధ్య లావాదేవీలతోపాటు సయోధ్య కుదిరిందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.
ఈ సంధితో విచారణ మూలకు పడేసినట్లు కొంత మంది బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మెప్మా టీఎల్ఎఫ్‌లోను పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, ఆనాడు జరిగిన ఆ అక్రమాలపై విచారణను సైతం పక్కన పడేశారని అందుకు కారణం కూడా విచారణాధికారుల సయోధ్య, బెదిరింపులేనని పలువురు నాయకుల ద్వారా తెలిసింది. కార్పొరేషన్ మెప్మాలో జరిగిన భారీ అవినీతి అక్రమాల తేనెతుట్టె కదలకుండా జిల్లా ఉన్నతాధికారులు సైతం అవినీతిపరులకు బాసటగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ మెప్మాలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించగా మరి ఆ విచారణ బుట్టదాఖలు అవుతుందా, అక్రమాల చిట్టాను బయటపెడతారా అనేది వేచి చూద్దాం.
