Friday, April 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNarayana | కేకే క్యాంపస్.. అంతా భోగస్..!

Narayana | కేకే క్యాంపస్.. అంతా భోగస్..!

కాలేజీలు మొదలవకముందే అడ్మిషన్లు.. అడ్డగోలుగా ఫీజులు వసూళ్లు..

  • ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఫీజు రూ.6-8 లక్షలు
  • ప్రభుత్వ హాస్టళ్ల కంటే దారుణంగా హాస్టళ్ల నిర్వహణ
  • పలుమార్లు భోజనంలో బల్లులు, బొద్దింకలు
  • ఒక్కో విద్యార్థికి రోజుకు బకెట్ నీళ్ళే దిక్కు
  • పేరే గొప్ప.. ఐఐటీ, నీట్ ర్యాంకులు శూన్యం
  • నారాయణ విద్యా సంస్థల అడ్డగోలు దందా..

పదో తరగతి పాస్ అయ్యారా.. నారాయణ జూనియర్ కాలేజీలో చేరండి.. మీకు ఐఐటీ, ఐఐఐటీ, నీట్‌లో ర్యాంకులు రావాలా.. అయితే మాదాపూర్, హైటెక్స్, అయ్యప్పసొసైటీలలోని కేకే క్యాంపస్‌లో చేరండి.. ఇదే కాకుండా ఐఐటీ, ఐఐఐటీ, నీట్ ఫలితాలు వచ్చిన సమయంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలలో తెగ ర్యాంకులు వచ్చినట్టుగా ఒకటి, ఒకటి, రెండు, రెండు, రెండు, మూడు, మూడు అంటూ ఈ ర్యాంకులన్నీ ఒక నారాయణలో చదివిన విద్యార్థులకే వచ్చినట్టుగా మీడియాలో ప్రకటనలు ఇస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బుట్టలో వేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి మాయ మాటలు కేవలం ఇంటర్ అడ్మిషన్లు అయ్యేంత వరకే. ఒక్కొక్క క్యాంపస్‌కు ఒక్కొ ఫీజు చొప్పున రూ.లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నారు.

- Advertisement -

ఆ తర్వాత విద్యార్థులకు చదువు విషయాన్ని పక్కన పెడితే కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.. ప్రభుత్వం నడిపించే సంక్షేమ హాస్టళ్లే వీటి కంటే వెయ్యి వంతుల నయంగా ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో బొద్దింకలు, బల్లులు పడ్డ భోజనాన్నే వడ్డిస్తున్నారు. చివరకు మూత్రశాలలు, మరుగుదొడ్లల్లో చుక్క నీరు ఉండటం లేదు. అపరిశుభ్ర భోజనం, దుర్గంధంగా మారిన క్యాంపస్ వాతావరణంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ర్యాంకుల మాట దేవుడెరుగు.. వాటి కంటే ముందే కాటికి పోయే అత్యంత దయానీయంగా కేకే క్యాంపస్ తయారు అయింది.

ఐఐటీ ఫ్యాకల్టీ పేరుతో దగా..:

దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ నారాయణగా చెప్పుకుంటారు. అందులోనే ఒకటిగా కేకే క్యాంపస్. కేకే క్యాంపస్ అనేది నారాయణలో అత్యధిక ఫీజులు వసూలు చేసే ఓ దగా క్యాంపస్. ఇక్కడ ఐఐటీ ఫ్యాకల్టీనే బోధిస్తారంటూ మాయమాటలు అడ్మిషన్ సమయంలో చెప్తారు. దీంతోనే మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ, వస్తావా పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి..

కేకే క్యాంపస్ లో రకరకాల పేర్లతో కాలేజీలు నిర్వహిస్తూ.. ఒక్కోక్క భవనంలో జూనియర్, సీనియర్ ఇంటర్ లలో ఏ నుంచి జడ్ వరకు సెక్షన్లు నిర్వజోస్టప్ అకాడెమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే, పదవతరగతి ఫలితాలు విడుదల కాకముందే తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్నారు.. నిజానికి 2026 జూన్ ఒకటో తారీఖున ఇంటర్ కాలేజీలు మొదలవుతాయి..

మరీ దారుణం ఏమిటంటే.. వీటిలో ఐఐటీ ఫ్యాకల్టీ ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మిగతా వారంతా లోకల్ సరుకే. అది కూడా అనుభవం లేని కొత్తవారే. చివరకు జూనియర్ లెక్చరర్లు కూడా లేకుండానే వార్డెన్లతో స్టడీ అవర్స్‌ను నడిపిస్తున్నారు. విద్యార్థికి ఏదైనా డౌట్ ఉంటే పరిష్కరించేందుకే జేఎల్స్ ఉంటారు. కానీ, ఇక్కడ చదువు రాని వారితో స్టడీ అవర్స్‌ను నడిపిస్తున్నారు. చివరకు అనుభవం లేని ఫ్యాకల్టీతో క్లాస్‌లు చెప్పిస్తూ విద్యార్థులను అయ్యోమయ్యానికి గురి చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు లేదా సంస్కృతం వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను ఒక్క పాఠం కూడా చెప్పకుండానే అంతా అయిపోయిందనిపిస్తున్నారు.

క్యాంపస్‌కో ఫీజు.. అంతా మోసం..:

నారాయణ కేకే క్యాంపస్ అలాగే రకరకాల పేర్లతో కాలేజీలు నడిపిస్తూ.. అడ్మిషన్ సమయంలోనే సగం చెల్లిస్తేనే సీటు ఇస్తారు. లేకుంటే సీటు ఇవ్వమంటూ తల్లిదండ్రులను మరింత భయపెడుతుండటంతో వారు చెప్పినట్టుగానే ఫీజలను చెల్లిస్తూ వస్తున్నారు. ఇదే కాకుండా దోబీ, స్టడీ మెటీరియల్ పేర్లతో మరో రూ.40-50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజులు భారీగా చెల్లిస్తేనే చదువంతా వస్తుందని తల్లిదండ్రులు భ్రమ పడుతున్నారు.

కానీ, ఇక్కడ చెప్పే చదువు మాత్రం అంతంతే. ఇక్కడి కంటే ర్యాంకుల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వ గురుకులాలలోని విద్యార్థులకే జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అనుభవం, సత్తాలేని లెక్చలర్లతో చేయించే విద్యా బోధనే. నాణ్యతలేని చదువులతో విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నారు.

ఒక్కో విద్యార్థికి నెలకు రూ.50-80 వేల ఫీజు..:

కేకే క్యాంపస్‌లలో ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి అతి తక్కువగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు ఒక విద్యార్థి అన్ని రకాలుగా కలిపి చెల్లించేది సుమారు రూ50 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుంది. అయినప్పటికీ సుచి, శుభ్రత లేని భోజనాన్నే వడ్డిస్తున్నారు. తినే భోజనంలో బల్లులు, బొద్దింకలు చనిపోయి కనిపిస్తుండటంతో సగం మంది విద్యార్థులు తిండిని మానేసి ఉపవాసాలుంటున్న వారే ఎక్కువ.

ఇలాంటి పరిస్థితులలో బల్లులు, బొద్దింకలు భోజనంలో వస్తున్నాయంటే.. మీరు వచ్చింది చదువుకోవడానికా? లేక తిండి తిని పడుకోడానికా? అంటూ అందరి ముందు అడుగుతూ విద్యార్థులను ఇన్సల్ట్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇదే మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, హైటెక్స్ ప్రాంతాలలో పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లల్లో నెలకు రూ.5వేల నుంచి రూ.7వేలలోపే చెల్లించి అన్ని రకాల సౌకర్యాలతో ఉండొచ్చు.

కానీ, ఇక్కడ నెలకు సుమారు రూ.50-80 వేల వరకు చెల్లిస్తున్నప్పటికీ ఎలాంటి సౌకర్యాలు ఉండటం లేదు. నాణ్యమైన చదువు లేదు. తినేందుకు నాణ్యమైన భోజనం లేదు. చివరకు మూత్రశాలలు, మరుగుదొడ్లల్లో నీరు కూడా ఉండటం లేదు. ఉదయాన్నే స్నానం చేస్తే తప్ప.. ఆ తర్వాత ఏ ఒక క్యాంపస్‌లో చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. మరుగుదొడ్లల్లో అడుగు పెట్టలేని దుస్థితి. క్యాంపస్ వదిలి బయటకు పోలేని పరిస్థితి. ఇలాంటి సమయాలలో విద్యార్థులు కడుపు నొప్పులతో బాధ పడుతున్నారు. విద్యార్ధినుల పరిస్థితి మరీ దయనీయం.

భవనాలకు అనుమతి లేదు..
విద్యార్థుల బతుకుకు భరోసా లేదు..

మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, హైటెక్స్ ప్రాంతాలలో ఉన్న కేకే క్యాంపస్ భవనాలకు ఏ ఒక దానికి కూడా అనుమతి లేదు. అక్రమ నిర్మాణాలే కాకుండా అత్యంత ప్రమాదకర భవనాలను ఇష్టారాజ్యంగా నిర్మించారు. వీటిలో ఏ ఒక భవనానికి ఫైర్ సేఫ్టీ లేదు. ఏ చిన్న ప్రమాదం జరిగినా బుగ్గి అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇదే కాదు, కనీసం విద్యార్థులు ఆడుకునేందుకు గజం ఖాళీ స్థలం కూడా కనిపంచదు. ఆటా, పాటలతో పాటు చదువు కోవాల్సిన వయస్సులో విద్యార్థులను బందిఖానా లాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు.. ఇవి వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

రసాయన నమూనాలున్న మూసీ నీరే దిక్కు.. :

మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, హైటెక్స్ ప్రాంతాలలో ఉన్న కేకే క్యాంపస్‌లకు ఏ ఒక దానికి కూడా మంచినీటి సౌకర్యం లేదు. దీనికి ప్రధాన కారణం అక్రమ నిర్మాణాలు కావడమే. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలలో బోర్లు వేయించి అక్కడి నుంచి ట్యాంకర్లల్లో నీటిని ఈ క్యాంపస్‌లకు తరలిస్తున్నారు. ఈ నీరంతా కలుషితమే కాదు.. వీటిలో ఎన్నో రకాల రసాయన నమూనాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలలో వెల్లడైంది.

ఈ నీటితోనే విద్యార్థులు స్నానాలు చేయడం, ఇతర అవసరాలకు వాడటంతో తల వెంట్రుకలు ఊడటం, శరీరంపై దురదలు, తర్వాత పుండ్లు రావడం, ఇంకా ఇలాంటి ఎన్నో రకాల జబ్బులకు కారణం అవుతున్నాయి. చివరకు ఈ నీటిని కూడా సరిపడా విద్యార్థులకు అందించడం లేదంటే దీని మేనేజ్‌మెంట్ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం డబ్బుల కోసమే తప్ప విద్యార్థులకు నాణ్యమైనవి ఏమీ కూడా అందించడం లేదు.

తల్లిదండ్రులారా.. ఆలోచించండి..!

నారాయణ విద్యా సంస్థలలో భాగమైన కేకే క్యాంపస్ బందెల దొడ్డిగా మారింది. భావిభారత పౌరుల జీవితాలను నాశనం చేసే నరకకూపంలా తయారు అయింది. నాణ్యతలేని చదువులు, పరిశుభ్రం లేని ఆహారం, కలుషిత జలాలతో స్నానాలు.. ఇలా ఎన్నో రకాలుగా విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తోంది నారాయణ విద్యాసంస్థ..

ఐఐటీ, ఐఐఐటీ, నీట్ ర్యాంకుల కంటే ముందే విద్యార్థులను కాటికి పోయేలా చేస్తోంది. వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థ డబ్బులే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో వ్యాపారం చేస్తోంది. కనీసం కపుడు నిండా తిండి కూడా పెట్టని నారాయణ విద్యా సంస్థలో చదివించడం అవసరమా? అనేది ఒకసారి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఆలోచించాలి.

అసలు ర్యాంకులు వస్తాయో? రావో ఎవరికీ తెలియదు. కానీ, ప్రస్తుతం మీ పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నారనే సత్యాన్ని మాత్రం గ్రహించాలి. ఇలాంటి భయంకరమైన నారాయణ లాంటి విద్యా సంస్థలో చదివించడం కంటే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేదా ప్రభుత్వ గురుకులాలలో చదివిస్తే మీ పిల్లల జీవితాలు బాగుంటాయి. భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. నారాయణ విద్యాసంస్థలో మీ పిల్లలను చేర్పించే ముందు ఒక సారి ఆలోచించండి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News