కారు గేరు మారనుందా
నేడు తెలంగాణభవన్‌కు కేసీఆర్
బీఆర్ఎస్ శ్రేణులకు అధ్యక్షుడి దిశానిర్దేశం
గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుబులు పుట్టించనుందా?
గడిచిన రెండేళ్లు ఒక లెక్క.. రాబోయే మూడేళ్లు మరో లెక్క కానుందా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉద్యమ స్థాయిలో ఊపందుకోనున్నాయా?
బీఆర్ఎస్ పార్టీ అధినేత(Brs Party President), మాజీ సీఎం (Former CM) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మరోసారి రాజకీయ రంగంలో చురుగ్గా అడుగులు వేయనున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత నేడు పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణభవన్(Telangana Bhavan)కు రానున్నారు. దీంతో.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తుంటి ఎముక గాయంతో విశ్రాంతి తీసుకున్న గులాబీ దళాధిపతి.. లోక్‌సభ ఎన్నికల (LokSabha Election) ప్రచారం ముగిసిన తర్వాత పూర్తిగా తన వ్యవసాయ క్షేత్రానికే (FarmHouse) పరిమితమయ్యారు. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. వారిని అక్కడికే పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన సందర్భంలోనూ, కొన్ని సార్లు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చినప్పటికీ తెలంగాణభవన్‌లో పెద్దగా కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈ రెండేళ్లలో ఒక్కసారి మాత్రమే కార్యవర్గ సమావేశం నిర్వహించగా గత ఏప్రిల్‌లో వరంగల్‌లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరోసారి తెలంగాణభవన్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్ష (బీఆర్ఎస్‌ఎల్పీ) సమావేశంతోపాటు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు కేసీఆర్ పూర్తి స్థాయి ప్రణాళికతో హాజరవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘గడచిన రెండేళ్లు ఒక లెక్క.. రాబోయే మూడేళ్లు మరో లెక్క’ అనే భావనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని సమాచారం. రాబోయే రెండేళ్లను పూర్తిగా ఎన్నికల సంవత్సరాలుగా భావిస్తూ కారు పార్టీని మళ్లీ ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ధోరణిలో ఉన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.. ఇకపై రేవంత్ రెండేళ్ల పాలనలోని వైఫల్యాలపై సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై ఆయన తీవ్రంగా స్పందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 91 టీఎంసీల నీటిని కేటాయిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు సరిపోతాయని కేంద్ర ప్రభుత్వానికి తెలిపిందనే అంశంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని అంటున్నారు. తద్వారా.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాల ప్రయోజనాలను విస్మరిస్తూ రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తోందనే ఆవేదనను ఆయన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నట్లు సమాచారం.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, కృష్ణా–గోదావరి నదీ జలాలపై పోరాటం కోసం ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్‌లో ఏర్పడిన నిరాశను దూరం చేయడంపైనా ఆయన దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలు రావడంతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహం పెరిగిందని విశ్లేషిస్తున్నారు.
త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది. నేడు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో.. వచ్చే ఎన్నికలపై నేతలకు కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. అలాగే.. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడితే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యే అవకాశముంది. అలాంటి పరిస్థితిలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై నేతలందరి అభిప్రాయాలను తీసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నారట. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న ఆయన.. కార్యవర్గ సమావేశంలో చర్చల అనంతరం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించనున్నారని సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీల నియామకాలకు మార్గదర్శకాలు ఇవ్వడంతోపాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయనున్నారని తెలుస్తోంది.
మొత్తానికి.. కేసీఆర్ మళ్లీ తెలంగాణభవన్‌కు వస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ మరింత దూకుడుగా ముందుకు సాగనుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
