- సముద్రతీరాలు, నదీతీరాల్లో పుణ్యస్నానాలు
- ఆలయాల్లో శైవారాధన.. కార్తీక దీపాల వెలిగింపు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. వేకువ జామునే సముద్ర, నదీస్నానాలు ఆచరించారు. దగ్గరలోని ఆలయాలకు వెళ్లి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. గోదావరి, కృష్ణానదుల్లో స్నానం చేయడంతో పాటు, తీరప్రాంతాల్లో ఆలయాల్లో సందడి నెలకొంది. ఇకపోతే శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేసారు. శ్రీశైలంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామిఅమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు.
స్వామిఅమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శాన్నికి 2 గంటల సమయం పట్టింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి, పూజలు, అభిషేకాలు చేసారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. యాదాద్రి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో భక్తుల రద్దీ కనిపించింది. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలా డాయి. శివనామస్మరణంతో శివాలయాలు మారుమోగాయి. తెల్లవారుజాము నుండే అలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేసారు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిట లాడాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, పూజలు చేస్తున్నారు. ధర్మపురి, బాసర, కాళేశ్వరంల వద్ద గోదావరి స్నానాలకు భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం ఆలాయాల్లో దీపారాధాన చేపట్టారు.
