- కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయ అభివృద్ధిని దోస్తున్న ఇద్దరు ధర్మకర్తలు.
- ఆలయ పర్యవేక్షణలో విఫలం అవుతున్న చైర్మన్, ఈవో లను తొలగించాలని పలువురి డిమాండ్..
- ఈ ఓ కు భక్తుల ఫిర్యాదు… ఎండో మెంట్ కమిషనర్ దృష్టి కి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని వెల్లడి.
- మూడు నెలల క్రింద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్మన్ ఘాట్ ధ్యానంజనేయ స్వామి ఆలయం కు దాత ఇచ్చిన లక్ష రూపాయలను వాడుకున్న ఓ ధర్మకర్త
- ఇటీవల రెండు రోజుల కిందట సదరు ధర్మకర్తను దాత నిలదీయడంతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు.
- పార్కింగ్ నిర్వాహకుని తో పాటు కొబ్బరి చిప్పలు సేకరించుకునే వారి దాకా అక్రమ వసూలు చేసిన ఓ ఇద్దరు ధర్మకర్తలు.
- ఆలయ అర్చకులకు ఆదాయం వచ్చే ఉప ఆలయాల్లో విధులు వేస్తామని డబ్బులు వసూలు చేశారనె ఆరోపణలు.
- ఆలయ చైర్మన్, ఈవో అలసత్వం నిర్లక్ష్యం వల్లనే పక్క దారి పడుతున్న దాతల డబ్బులు.
- చైర్మన్ సత్యనారాయణ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని పలువురి డిమాండ్
- ఈవోను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలంటూ ఉన్న పలువురు భక్తులు.
- నేడు ఆలయ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహిస్తామని స్థానిక భక్తులు, మాజీ ధర్మకర్తల వెల్లడి.
పురాతన చరిత్ర కలిగిన కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రసిద్ధి చెందింది. రాష్ట్రం నలుమూల నుండే గాక వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి వారిని మొక్కితే అన్ని కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం, కొంతమంది భక్తులు ఆలయ అభివృద్ధి కోసం వివిధ రూపాల్లో దాతలుగా వ్యవహరించి ఆలయ అభివృద్ధికి పాటుపడుతుంటారు.
కాగా గత మూడు నెలల క్రిందట ఓ దాత లక్ష రూపాయలు ఆలయ అభివృద్ధికి అందజేయాలన్న ఉద్దేశంతో ఆలయ చైర్మన్ సత్యనారాయణ రెడ్డికి ఫోన్ చేయగా, తాను ఆలయానికి ఆలస్యంగా వస్తానని ఆలయంలో మరెవరికైనా ధర్మకర్తకు ఇవ్వండని సూచించడంతో…
ఆ లక్ష రూపాయలను తోకటి కిరణ్ అనే ధర్మకర్తకు అందజేసి వారు వెళ్లిపోయారు. ఈ విషయం కొన్ని రోజుల తర్వాత పలువురు ధర్మకర్తలు దాత ఇచ్చిన లక్ష రూపాయలు గురించి ధర్మకర్త కిరణ్ ను అడగగా.. దాతకు తిరిగి ఇచ్చేశానని, సదరు దాతనే ఆలయంలో పని చేపిస్తానని డబ్బులు తిరిగి తీసుకున్నాడని అందరి సమక్షంలో ఆ ధర్మకర్త చెప్పడంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు.
తీరా చూస్తే మూడు నెలల తర్వాత ఆ దాత ఆలయానికి వచ్చి లక్ష రూపాయలతో ఏం పని చేశారని సదరు ధర్మకర్త ను నిలదీయడంతో అక్రమంగా వాడుకున్న లక్ష రూపాయల బాగోతం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆలయ ఈవో ఈ ఓ లావణ్య దృష్టి కి తీసుకు వెళ్లి ప్రశ్నించారు.ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

అర్చకులను, పార్కింగ్, కొబ్బరి చిప్పలు సేకరించుకునే వారిని కూడా వదలని ధర్మకర్తలు
ముఖ్యంగా ధ్యానాంజనేయ ఆలయంలో ఓ ఇద్దరూ ధర్మకర్తలు ఇష్టానుసారంగా అక్రమ వసులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అర్చకుడి నుండి డైరీలు ముద్రిస్తామని రూ.40 వేలు వసూలు చేశారు. కానీ మరో అర్చకుడితో 50 డైరీలు తెప్పించి మమ అనిపించారు. మిగతా సొమ్మును దర్జాగా జేబులో వేసేసుకున్నారు.
ఇదిలా ఉండగా అర్చకులకు మంచి ఆదాయం వచ్చే ఉప ఆలయాల్లో విధులు నిర్వహించుకునే విధంగా చూస్తామని వారి దగ్గర సైతం లక్ష రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఆ ఇద్దరి ధర్మాకర్తలపై వినబడుతుంది. ఈ తతంగం అంతా నడిపింది ఆలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ అనే ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ప్రసాద్ అనే ఉద్యోగి డిప్యూటేషన్ పై వచ్చి ఇక్కడే పూర్తిగా మాకం వేయడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ వసూళ్లు చేసే ధర్మకర్తలతో అంట కాగుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. వీటన్నిటిని విచారణ చేపట్టి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయంలో ఇన్ని తతంగాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న ఆలయ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని, ఈవో ను సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
