హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశుల్లో చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే కామద ఏకాదశి ప్రత్యేకమైనది. “కామద” అన్న పదానికి అర్థం — “కోరికలు నెరవేర్చే”. అందుకే ఈ ఏకాదశిని కోరికల పరిపూరణకు కారణమయ్యే పవిత్ర దినంగా భావిస్తారు.
ఈ ఏకాదశికి మరొక పేరు ‘దమన ఏకాదశి’.
ఇది మనిషి లోపాలను — కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను — దమన చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. వరాహ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడు. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఈ వ్రత విశిష్టతను వివరించాడని కూడా పురాణ ప్రస్తావన ఉంది. ఈ వ్రతం ద్వారా సంతాన లభ్యం, వైవాహిక జీవిత సౌఖ్యం, సౌభాగ్య స్థిరత్వం లభిస్తాయని నమ్మకం.
పూర్వం రత్నపుర అనే రాజ్యంలో పుండరీకుడు అనే రాజు పాలన సాగించేవాడు. ఆయన రాజసభలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు కళలతో వినోదాన్ని అందించేవారు.
ఒకరోజు, లలితకాంత అనే గంధర్వుడు తన భార్య లలితను గురించిన ఆలోచనలతో తక్కువ నిబద్ధతతో కళా ప్రదర్శన ఇవ్వడం గమనించిన రాజు, కోపంతో అతనిని రాక్షసుడిగా కమ్మని శపించాడు. తన స్వరూపం కోల్పోయిన లలిత కాంతుని భార్య లలిత, భర్తను రక్షించేందుకు శృంగి మహర్షిని ఆశ్రయించింది. మహర్షి ఆమెకు కామదా ఏకాదశి వ్రతం ఆచరించమని ఉపదేశించాడు.
లలిత భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించడంతో భర్తకు శాప విమోచనం లభించి పూర్వరూపాన్ని పొందాడు. వీరిద్దరూ మోక్షాన్ని పొందినట్లు పురాణం చెబుతుంది.
దశమి రోజున సాయంత్రం తర్వాత తిండి తీసుకోకుండా ఉపవాసానికి సిద్ధమవ్వాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధంగా స్నానం చేయాలి. పూజా గృహంలో విష్ణు విగ్రహాన్ని అలంకరించి, దీపం, పుష్పాలు, తులసీదళాలు సమర్పించాలి. విష్ణు సహస్రనామం, అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి. ఉపవాసంతో, జాగరణతో ఈ దినాన్ని గడపాలి.
ద్వాదశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దానధర్మాలు చేసి, ఆ తరువాతే స్వయంగా భోజనం చేయాలి. తద్వారా పూర్వకర్మల వల్ల ఏర్పడిన పాపాలు తొలగిపోతాయి. కోరికలు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. స్త్రీలకు సౌభాగ్యం నిలుస్తుంది. వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. మోక్ష మార్గం వైపు అడుగులు వేయ గలుగుతారు.
కామద ఏకాదశి ఒక పరమ పవిత్రమైన వ్రతం. భక్తి, శ్రద్ధ, నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. దురాశలు తొలగిపోయి, ఆత్మ శుద్ధి కలుగుతుంది. శాస్త్రాలు, పురాణాలు చెప్పిన విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు, కోరికల పరిపూరణ జరుగుతాయి.
