- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలని డిమాండ్
న్యాయవాదిగా పనిచేస్తున్న, పెళ్లి చేసుకునే వయసులో ఉన్న స్వప్నను సొంత కుటుంబ సభ్యులే హత్య చేయడం అత్యంత బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. స్వప్న తనకు ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అప్పుడే స్పందించి యాక్షన్ తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని మండిపడ్డారు. దీనిపై డీజీపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గురువారం మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో స్వప్న కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, హైదరాబాద్‌లో గన్నులతో బెదిరించి డబ్బులు గుంజుకునే ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులంటే భయం లేకపోవడమే ఇలాంటి హత్యలకు కారణమని, పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు వస్తే సీరియస్‌గా తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
స్వప్న హత్యపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి మూడు నెలల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్లు ఇప్పటికే ధర్నాలు చేసి బెయిల్ ఇవ్వబోమని స్పష్టం చేశారని గుర్తు చేశారు.
అలాగే న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తీసుకురావాలని, ఆ బిల్లు రెండేళ్లుగా అసెంబ్లీలో పెండింగ్‌లో ఉందని తెలిపారు.
హోం, మున్సిపల్, విద్యా శాఖలను సీఎం తన దగ్గరే పెట్టుకుని కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్ అగ్నిప్రమాదంలో 22 మంది చనిపోయినా, గురుకులాల్లో విషపు ఆహారం తిని, పాములు కరిచి విద్యార్థులు మృతి చెందుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
