- ప్రజాస్వామ్యానికి నాల్గవ మూలస్తంభం!
దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థలో గత కొంతకాలంగా ఒక అసహజ ధోరణి కనపడుతూ రోజురోజుకూ బలపడుతోంది.ఆయా ఎన్నికల సమయంలోనే “జర్నలిస్టుల ప్రాధాన్యం అమితంగా పెరుగుతుంది. నాయకుల ప్రతి సభ,సమావేశం, ప్రతి ప్రకటన, ప్రతి హామీ,ప్రతీ మాట ప్రజలకు చేరేది జర్నలిస్టుల ద్వారా మాత్రమే. ప్రజల్లో వారి పట్ల సానుకూల వాతావరణం కల్పించేందుకు వారు అహర్నిశలు శ్రమిస్తారు. కానీ ఎన్నికలు పూర్తయ్యాక, అధికారంలోకి వచ్చిన తరువాత అదే అంతగా అక్కరకు వచ్చిన జర్నలిస్టుల ను ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పూర్తిగా మరచిపోవడం ఓ సాధారణంగా వ్యవహారం గా మారింది.
ఒక రాజకీయ నాయకుడికి ప్రజలలో మంచి పేరు రావాలంటే మీడియా సహకారం తప్పనిసరి. ప్రచార యాత్రలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలకు తెలియజేసే బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది. ప్రజల స్పందనను నాయకులకు తెలియజేయడంలో కూడా వారు కీలక పాత్ర పోషిస్తారు. అయినప్పటికీ, వారి వృత్తి భద్రత, జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై రాజకీయ నాయకుల దృష్టి చాలా చాలా అరుదుగా పడుతోంది.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి మరింత క్లిష్టంగా, అద్వాన్నంగా ఉంది. అతి తక్కువ (నిజం చెప్పాలంటే అసలే లేదు ) పారితోషికం, ప్రమాదభరిత పరిస్థితుల్లో పని చేయడం, ఎటువంటి భద్రతా హామీలు లేకపోవడం ఇవన్నీ వారి దైనందిన కఠోర వాస్తవాలు. ప్రమాద బీమా, ఆరోగ్య సదుపాయాలు, పెన్షన్ వంటి అంశాలు చాలామందికి అందుబాటులో లేవు. అవసరమైనప్పుడు మాత్రమే విలువ ఇవ్వడం,ఆపై ఓమూలకు విసిరేసినట్లుగా వ్యవహరించడం మాములే.అయితే మిగతా సమయాల్లో పట్టించుకోకపోవడం వారికి ఇoకా బాధాకరం.
ఓవైపు ప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్థంభం అని పిలవబడుతుంది. మరో వైపు అది కేవలం ప్రచారం మాత్రం గానే మిగిలింది. జర్నలిస్ట్/జర్నలిజం కేవలం రాజకీయ నాయకులకు ప్రచారం చేసే సాధనం కాదు; ప్రజల గొంతుక. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఓ వంతెన.ఓ విలువైన సాధన సంపద. అలాంటి వృత్తిని కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. జర్నలిస్టు ఎవరికి శత్రువు కాదు,ఎవరికీ ప్రత్యర్థి కాదు అతను ప్రజాస్వామ్యానికి నాల్గవ మూలస్థంభం ప్రధాన భాగస్వామి.
ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. జర్నలిస్టుల సంక్షేమానికి స్పష్టమైన విధానాలు రూపొందించాలి. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, వృత్తి రక్షణ చర్యలు తీసుకోవాలి. గ్రామీణ విలేకరుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. విమర్శలను శత్రుత్వంగా కాకుండా ప్రజాహిత దృష్టితో స్వీకరించాలి.
జర్నలిస్టు ఒక సాధారణ వ్యక్తి కావచ్చు. కానీ అతని కలం *అసాధారణ శక్తి కలిగి ఉంటుంది. ఆ కలం ప్రజల ఆశలు, బాధలు, నిజాలను వెలుగులోకి తీసుకువస్తుంది. ఆ కలాన్ని గౌరవించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, ఎప్పటికీ జర్నలిస్టుల పట్ల గౌరవం, సహకారం, బాధ్యత చూపినప్పుడే దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, పల్లెల్లో నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుంది.మరింతగా పరిడవిల్లుతుంది.
