- పద్మారావు గౌడ్
- ప్రజల దృష్టి మళ్లించేందుకే నోటీసులు
- మేము ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదు
- ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటాం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం సరికాదని,ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలేనని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం సీతాఫలమండిలో మీడియాతో మాట్లాడిన ఆయన,ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నోటీసులు జారీ చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారని,ప్రజాగ్రహం నుంచి దృష్టిని మళ్లించేందుకు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారని ఆరోపించారు.
తాము అధికారంలో ఉన్న సమయంలో కుట్రపూరితంగా,కక్షసాధించే విధంగా రాజకీయాలు చేయలేదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు.రాజకీయ ప్రత్యర్థులను వేధించే సంస్కృతి తమకు లేదని,ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ పాలన సాగించామని గుర్తు చేశారు.ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కక్షపూరిత చర్యలతో ప్రజల తీర్పును మార్చలేరని ఆయన హెచ్చరించారు.
