- అమెరికా ఆయిల్ ట్యాంకర్ షిప్ పై దాడి..
తన యుద్ధనౌకపై జలాంతర్గామితో అమెరికా దాడి చేసి సముద్రంలో ముంచేయడంపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకున్నది. అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ షిప్‌పై దాడి చేసింది. గురువారం ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో ఒక అమెరికన్ ట్యాంకర్‌పై క్షిపణులతో ఎటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది.
ఇరాన్ దాడి వల్ల అమెరికా ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు వ్యాపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఇరాన్‌కు చెందిన ఐఆర్‌ఐఎస్ దేనా వార్‌షిప్ భారత్‌లో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్నది. ఆ తర్వాత ఇరాన్‌కు అది బయలుదేరింది. మంగళవారం రాత్రి శ్రీలంక తీరం సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఆ ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి చేసింది. టార్పెడ్‌తో ఎటాక్ చేయడంతో ఇరాన్ యుద్ధనౌక దేనా రెండు ముక్కలై సముద్రంలో మునిగిపోయింది.
మరోవైపు అందులో ఉన్న 130 మందికిపైగా సిబ్బందిలో 87 మంది నావికులు మరణించారు. గాయపడిన కొంతమందిని శ్రీలంక నేవీ కాపాడింది. సుమారు 36 మంది ఇరాన్ నావికులు ప్రస్తుతం శ్రీలంకలో చికిత్స పొందుతున్నారు. అయితే అమెరికా పాల్పడిన ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీ హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
