క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026 ఏడాదికి గాను వేలం డిసెంబర్‌లో జరగనుంది. డిసెంబరు 13 లేదా 15 తేదీల్లో మినీ వేలం జరగనున్నట్లు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం లీక్ అయ్యింది. అయితే ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ చర్చించిన తర్వాత ఓ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ పాలకమండలి మాత్రం ఐపీఎల్ వేలానికి ఇంకా ముహూర్తం ఖరారు చేయలేదు. అయితే గత రెండు సీజన్లలో జరిగినట్లుగా వేలాన్ని విదేశాల్లో నిర్వహించే అవకాశం ఈసారి లేనట్టుగా తెలుస్తోంది. 2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ ఐపీఎల్ వేలాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 2026 ఏడాదికి గానూ, 2025లో మినీ వేలాన్ని స్వదేశంలోనే నిర్వహించాలని సమాలోచనలు చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లును నవంబరు 15లోపు రిటైన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. ఆ తేదీ నాటికి ప్రస్తుతం తమ దగ్గర ఉన్న ఆటగాళ్ల వివరాలు, రిటైన్ ఆటగాళ్లు, వదిలేస్తున్న క్రికెటర్ల వివరాలను ఆ డెడ్‌లైన్ లోపల టీమ్ మేనేజ్‌మెంట్ బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన జట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని బీసీసీఐ(BCCI) వర్గాలు చెబుతున్నాయి. మినీ వేలంలోకి కొందరు ఆటగాళ్లు రానున్నారని విశ్వసనీయ సమాచారం. వారిలో దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, శామ్ కరన్, సీఎస్కే ఆటగాడు డేవాన్ కాన్వే వంటి వారు ఉన్నారట. సీఎస్కే ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు పర్స్ వాల్యూలో రూ. 9.75 కోట్లు జమ చేస్తారు. ఈ డబ్బుతో కొత్త వారిని కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి కెప్టెన్ సంజూ శాంసన్ తప్పుకుంటున్నారని సమాచారం. అలానే స్పిన్నర్లు వానిందు హసరంగా, మహీష్ తీక్షణ కూడా వేలంలోకి రానున్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి టి నటరాజన్, మిచెల్ స్టార్క్, ఆకాశ్ దీప్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్ వంటి వాళ్లని కూడా జట్టు వదులుకోనుంది. కానీ, వీటిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
