- తొలిరోజు పలు రంగాల ప్రముఖులతో చర్చలు
- మోడీ చొరవతో దేశంలో విప్లవాత్మక మార్పులు చంద్రబాబుకు ప్రవాసుల ఘనస్వాగతం
దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చంద్రబాబు చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిథ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగా ల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో తన తొలిరోజు పర్యటనను బుధవారం ప్రారంభించారు. దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబీలోని అమర్నాథ్ లతో 755.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సమావేశమయ్యారు.

ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం అన్నారు. భారతదేశం బ్రాండ్ను.. ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని మోదీ పర్యటించినన్ని దేశాలు మరే ఇతర ప్రధాని పర్యటించలేదని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం – పెట్టుబడులు పెరగడానికి ప్రధాని కృషే కారణమని కొనియాడారు. ఆంధప్రదేశ్ కు ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. యూఏఈలోని వివిధ దేశాలకు చెందిన సావరిన్ ఫంగ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టే ఆంశంపై ప్రత్యేకంగా చర్చించారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని సీఎం వెల్లడించారు. యూఏఈలో ఉన్న తెలుగు వారికి ఇండియన్ ఎంబసీ సహకారం అందించే అంశంపై భేటీలో చర్చ జరిగింది. ఆయా దేశాల్లో ఉన్న 4.08 లక్షల మంది తెలుగు ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే యూఏఐ పర్యటనపై బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం దుబాయ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు ఘనస్వాగతం లభించింది. స్థానిక భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, దుబాయ్ నగర శాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విశ్వేశరరావు, ముక్కు తులసి కుమార్, తెలుగు సంఘం అధ్యక్షుడు మసీయోద్దీన్, ఇతర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు.

చంద్రబాబును ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. యూఏఈలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రవాసీయులు భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి అన్ని గల్ఫ్ దేశాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు దుబాయు బయలుదేరుతున్నారు. ప్రవాసీయుల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రవాసాంధ్ర భరోసా అనే వినూత్న బీమా పథకాన్ని దుబాయ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ పథకం వల్ల ఆపదలో ఉన్న ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. మరణించిన సందర్భాల్లో రూ.10 లక్షల వరకూ పరిహారాన్ని ఈ పథకం కింద అందించనున్నట్లు వివరించారు.
