- సరైన పత్రాలు లేకుండానే విచ్చలవిడిగా కరెంట్ మీటర్ల మంజూరు..
- భారీగా ముడుపులు అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు..!
- సుప్రీం కోర్టు ఆదేశాలను భేఖాతర్ చేసిన ఉద్యోగులు..
- ఒక్కో స్తంభానికి ఒక్కో రేటు, మీటర్ల మంజూరుకు భారీ వసూళ్లు..
- విజిలెన్స్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు..
సమాజంలో విద్యుత్ రంగం అత్యంత ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది.. ప్రజలకు వెలుగులు అందించడమే కాకుండా.. పరిశ్రమల నిర్వహణకు విద్యుత్ అనేది ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. అలాంటి విద్యుత్ రంగంలో అవినీతి విచ్చలవిడిగా ప్రవహిస్తోందని విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.. ఇది వాస్తవం అని నిరూపిస్తూ అయ్యప్ప సొసైటీలో వెలుగు చూసిన సంఘటనే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.. వివరాలు ఒకసారి చూస్తే..
అయ్యప్ప సొసైటీలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సోమవారం సమగ్ర విచారణ చేపట్టడంతో విస్తుపోయే అంశాలు, అవినీతి భాగోతాలు వెలుగులోకి .. విద్యుత్ విజిలెన్స్ సీఐ రామకృష్ణ ఇతర అధికారులు అయ్యప్ప సొసైటీలో విచారణ చేపట్టారు. సరైన పత్రాలు లేకుండానే విచ్చలవిడిగా కరెంట్ మీటర్లు ఇచ్చారని, నిర్మాణాలు అయిన బిల్డింగ్ లకు కూడా ఓసీ ఇవ్వకుండానే అక్రమంగా కనెక్షన్లు ఇచ్చారని అధికారుల దృష్టికి వచ్చింది. విద్యుత్ కనెక్షన్ల విషయంలో అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నారని, సుప్రీంకోర్టు ఆర్డర్ సైతం బేఖాతరు చేసినట్లు తెలుస్తుంది. విద్యుత్ మీటర్లు ఇచ్చేందుకు లక్షల్లో వసూళ్లు చేసినట్లు అభియోగాలు.
అక్రమ నిర్మాణాలకు కరెంట్ మీటర్ల మంజూరు విషయంలో లైన్ మెన్ల నుండి ఏఈ, డీఈ, ఎస్ ఈ స్థాయి అధికారుల వరకు పాత్రధారులుగా ఉన్నట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.. ఒక్కో స్తంభానికి ఇంత అంటూ రేట్ కట్టి, మీటర్ల మంజూరు కోసం భారీ వసూళ్లు పాల్పడినట్లు తెలుస్తోంది, సుప్రీంకోర్టులో కేసులో స్టేటస్ కో ఉన్న భూముల్లో కట్టిన నిర్మాణాలకు ఎలా మీటర్లు మంజూరు చేశారు అంటే.. నిర్మాణదారులు అఫిడవిట్ ఇచ్చారంటూ తప్పించుకునేందుకు విద్యుత్ సిబ్బంది ప్రయత్నిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. కమర్షియల్, భారీ భవనాలకు మంజూరు చేసిన ట్రాన్స్ ఫార్మర్ల విషయంలో అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న విద్యుత్ విజిలెన్స్ విచారణలో విద్యుత్ అధికారుల డొంక కదులుతోంది.. బడా బిల్డర్ల దగ్గర భారీగా డబ్బుల వసూళ్లకు పాల్పడిన విద్యుత్ సిబ్బంది అరాచకాలు విజిలెన్స్ విచారణలో ఒక్కొక్కటిగా బయటకు తీస్తారని ఎదురు చూస్తున్నారు స్థానిక ప్రజలు.