మధుమేహాన్ని చక్కెర వ్యాధి, డయాబెటిస్(Diabetes) అని కూడా అంటారు. ఇది.. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి(Glucose Level) వంటి లక్షణాలతో కూడిన రుగ్మత. కణాలు, కణజాలాలు శక్తిని ఎలా గ్రహిస్తాయో అలాగే కొవ్వులు, ప్రోటీన్ల విచ్ఛిన్నతను నియంత్రించే కీలకమైన హార్మోన్ ఇన్సులిన్. ఇది క్లోమంలోని బీటా కణాలు స్రవించే హార్మోన్. రక్తం నుంచి గ్లూకోజ్‌ను శక్తి కోసం శరీర కణాల్లోకి తరలించడానికి సహాయపడుతుంది.
20వ శతాబ్దం నుంచి వైద్యులు ఇన్సులిన్‌ను వేరుచేసి ఇంజెక్షన్ రూపంలో అందించగలిగారు. దీన్ని డయాబెటిస్‌కు విజయవంతంగా చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చని కనుగొన్నారు. అప్పటి నుంచి డయాబెటిస్ ఉన్నవారి వివిధ అవసరాలను తీర్చడానికి అనేక రకాల ఇన్సులిన్లను అభివృద్ధి చేశారు. 1922 జనవరి 11న టొరంటో జనరల్ హాస్పిటల్‌లో చనిపోతున్న 14 ఏళ్ల డయాబెటిస్ రోగి లియోనార్డ్ థాంప్సన్‌కు మొదటిసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చారు.
వేదకాలంలో కూడా మధుమేహం ప్రస్తావన ఉంది. అప్పట్లో మధుమేహాన్ని అశ్రవ అనే పేరుతో పేర్కొనేవారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలేంటి? అని చరక సంహిత, శుశ్రవ సంహిత, నాగబట్ట గ్రంథాల్లో వర్ణించారు. క్రీస్తుశకానికి 1000 ఏళ్ల కిందట ఈ వ్యాధి వర్ణన ఉంది. యజ్ఞ సమయాల్లో దేవతలకు సమర్పించే హవిస్సును భుజించడం వల్లో ఈ వ్యాధి వచ్చినట్లు పేర్కొన్నారు. దక్షప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వల్లో ఈ వ్యాధి వచ్చినట్లు ప్రస్తావించారు.
క్రీస్తు శకం 6వ శతాబ్దంలో అష్టాంగ హృదయ అనే గ్రంథంలో మధుమేహం అనే పదాన్ని వాడారు. తేనెను మధువు అని అంటారు కాబట్టి ఈ వ్యాధిగ్రస్థుల మూత్రం తేనె రంగులో ఉంటుందని దీనికి ఈ పేరు వచ్చినట్లు భావిస్తున్నారు. 1400 ఏళ్ల కిందటే ఈ వ్యాధిని పథ్యం, ఔషధం, వ్యాయామంతో క్రమపరచవచ్చని పేర్కొన్నారు. దాదాపు ఇప్పటికీ అనుసరిస్తున్న విధానం ఇదే కావడం గమనార్హం.
మధుమేహం లక్షణాలు.. అతి మూత్రం, దాహం, ఆకలి అని చెబుతారు.
మధుమేహం వంశపారంపర్యంగా(Heredity) వచ్చే ఛాన్స్ ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోవటం, పోషక పదార్థాల్లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వ ఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి కారణం. అతిగా పాలు తాగడం, పాల ఉత్పత్తులు భుజించడం, అతిగా చక్కెర ఉపయోగించడం, చక్కెర రసాలు తాగడం, కొత్త ధాన్యాలను వంటల్లో వాడటం వల్ల చక్కెర వస్తుంది.
తాజాగా చేసిన సురను(మధువును) సేవించడం, అతిగా నిద్రపోవడం, శరీర శ్రమ కావలసినంత చేయకపోవడం, మానసిక ఆందోళన, భారీ కాయం, ఆహారపు అలవాట్లు, ముందుగా తిన్నది జీర్ణంకాక ముందే తిరిగి భుజించడం, ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం, అతిగా ఆహారం తీసుకోవడం లాంటి కారణాలతో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకోవాలి. రోజూ మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును, నూనె పదార్థాలను బాగా తగ్గించాలి.
పాదరక్షలు(Footwear) లేకుండా నడవకూడదు. పొగ తాగడం పూర్తిగా మానాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. భోజనానికి అర గంట ముందు మాత్రలు వేసుకోవాలి. రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
అధిక రక్తపోటు(High BP), కొలెస్ట్రాల్ పరీక్షలు, కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాలి. గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ఏటా ఈసీజీ, ట్రెడ్‌మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. మధుమేహం 10 ఏళ్ల కన్నా మించి ఉన్నా, వయసు 65 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్నా, రక్తంలో గ్లూకోజు పరిగడుపున 250 కన్నా ఎక్కువ, తిన్న తర్వాత రెండు గంటలకు 500 కన్నా ఎక్కువ, హెచ్‌బీఏ1సీ 10 కన్నా ఎక్కువ, ట్రైగ్లిజరైడ్లు 600 కన్నా ఎక్కువ ఉన్నవాళ్లు ఇన్సులిన్ తీసుకోవటం మేలు.
మధుమేహం(షుగర్) వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టిన రోజు నవంబరు 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు. రక్తంలో చక్కెరను, శక్తి శోషణను నియంత్రించడానికి ఇన్సులిన్ ఒక ముఖ్యమైన హార్మోన్. ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెరను, శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తుంది. జీర్ణ రసాలను తయారు చేసే క్లోమం (ప్యాంక్రియాస్) గ్రంథి నుంచి సృష్టించిందే ఇన్సులిన్.
ఇది రక్తంలో గ్లూకోజ్‌ను ఏ క్షణంలోనైనా నియంత్రిస్తుంది. కాలేయం, కొవ్వు, కండరాల్లో గ్లూకోజ్ నిల్వకు కూడా సహాయపడుతుంది. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల జీవక్రియను నియంత్రిస్తుంది.
(జనవరి 11.. తొలిసారి చక్కెర వ్యాధి రోగులకు ఇన్సులిన్ ఇచ్చిన రోజు సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
