- భక్తుల మనోభావాలను గౌరవించాలి
- గిరిప్రదక్షిణ చేసే భక్తులకు భక్తి భావం కలిగే విధంగా చూడాలి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వాతి నక్షత్రం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్దకు చేరుకుంటారు.ఈ గిరి ప్రదక్షిణ వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమై సుమారు మూడు కిలోమీటర్ల మేర భక్తులు బాజా భజంత్రీలతో, భజనలతో, భక్తి శ్రద్ధలతో, కోలాహలంగా గిరి ప్రదక్షణ నిర్వహిస్తుంటారు.కానీ స్వామివారిని దర్శించుకోవడానికి సరైన విగ్రహం లేదు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వైకుంఠ ద్వారం వద్ద కేవలం స్వామివారి ఒక ఫ్లెక్సీ మాత్రమే ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.
ఈ ఫ్లెక్సీకే ఆలయ అధికారులు, భక్తులు,గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన వీఐపీలు కూడా ఆ ఫ్లెక్సీ కే కొబ్బరికాయలు కొట్టి, హారతినిచ్చి గిరి ప్రదక్షిణ ప్రారంభించడం విడ్డూరంగా ఉంది. తెలంగాణలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట దేవస్థానంలో గిరి ప్రదక్షిణ చేసేముందు ఫ్లెక్సీ కి కొబ్బరికాయ కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు,గిరి ప్రదక్షిణ చేసే భక్తులు.ఈ విషయంపై బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ వైకుంఠ ద్వారం వద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని గతంలో దేవస్థానం అధికారులను సంప్రదించగా,ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టామని ఆలయ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆలయ అభివృద్ధికై నిజంగా అధికారులు ఆలోచించినట్లయితే ఇప్పటికైనా భక్తుల మనోభావాలను,ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి తరహాలో వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ,గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు భక్తి భావం కలిగే విధంగా,స్వామివారి ఆశీస్సులు పొందగలిగే విధంగా వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
