Tuesday, March 17, 2026
Homeసాహిత్యంLife | చిరుభావాల చిరుచిట్టా

Life | చిరుభావాల చిరుచిట్టా

చిరునవ్వులు చిందుతా
మనసుల ముంగిట పూలవుతా,
మాటలకన్నా ముందే
హృదయాలను చేరుతా.

చిరువెన్నెల చల్లుతా
నిశ్శబ్దానికి వెలుగవుతా,
చీకటి కళ్లకు
కలల దీపమవుతా.

- Advertisement -

చిరుగాలులు వీస్తా
అలసిన ఊపిరికి ఊరటనిస్తా,
భారం మోసే హృదయానికి
సేద తీర్చుతా.

చిరుదివ్వెలు వెలిగిస్తా
ఆశల అంచుల్ని తాకుతా,
చిన్న వెలుగే పెద్ద దారిని
చూపుతుందని చెబుతా.

చిరుజల్లులు చల్లుతా
ఎండిన కలల్ని తడుపుతా,
చిన్నచిన్న బిందువులే
సముద్రమవుతాయని గుర్తుచేస్తా.

చిరుగజ్జెలు కట్టుకుంటా
కాలంతో తాళం వేస్తా,
నడకలోనే లయను నింపి
నాట్యం చేస్తా.

చిరుపూజలు చేస్తా
మనసే గర్భగుడిగా చేసుకొని,
నిజాయితీనే
నైవేద్యముగా అర్పించుకుంటా.

చిరుకోరికెలు కోరుతా
అతి ఆశలు లేకుండా,
సంతృప్తే
సర్వస్వమని తెలుపుతా.

చిరుకోపాలు చూపుతా
ప్రేమకు సరిహద్దులు గీస్తా,
మౌనమే
బోధకుడవుతుందని నేర్పుతా.

చిరుచివాట్లు పెడతా
నోరును మూయిస్తా,
కాళ్లబేరానికి తెచ్చుకుంటా,
చెప్పినట్లు చేయించుకుంటా.

చిరుతగవులకు దిగుతా
అలకపానుపు ఎక్కుతా,
బెదిరించి లొంగదీసుకుంటా,
చెప్పుచేతల్లో పెట్టుకుంటా.

చిరుకవితలు అల్లుతా
ఈ చిన్నచిన్న క్షణాలతోనే,
జీవితం అనే
మహాకావ్యాన్ని కూర్చుతా.

చిరుక్షణాలు తలచుకో
చిరుప్రాయాన్ని గుర్తించుకో
చిరుమూటలు కట్టుకో
చిరుభావాలు వెల్లడించు.

చిరుచిట్కాలు పాటించు
చిరుకార్యాలు చేసెయ్యి
చిరువిజయాలు సాధించు
చిరుపతకాలు గెలుచుకో.

  • గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
- Advertisement -
RELATED ARTICLES

Latest News