పెన్సిల్ చిన్నదే అయినా. అది ప్రపంచానికి(World) అందించే సేవలు(Services) అపారం. అలాగే.. పెన్సిల్‌కి ప్రపంచం అందించే సహకారం కూడా గొప్పదే. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడం నుంచి శాస్త్రవేత్తలు(Scientists) ఆవిష్కరణలు(Inventions) చేయడం వరకు ప్రతి దశలో పెన్సిల్ భాగస్వామి అవుతుంది. పిల్లలకి విద్యలో మొదటి స్నేహితుడు పెన్సిల్. తప్పు చేసినా తుడిచేయగలగడం వల్ల ఇది భయం లేని అభ్యాసానికి చిహ్నం. చిత్రకారులు(Artists), డిజైన్ నిపుణులు(Design Experts), ఆర్కిటెక్టులు(Architects) తమ ఆలోచనలకు రూపమివ్వడానికి పెన్సిల్‌ను ఉపయోగిస్తారు. ఒక చిన్న పెన్సిల్ దాని గీతలతో భవిష్యత్ నగరాల నమూనాలను గీయగలదు. అందమైన చిత్రాలను సృష్టించగలదు. కానీ.. ఈ చిన్న వస్తువులు తయారవ్వడానికి ప్రపంచంలోని అనేక దేశాల సహకారం అవసరమని ఎప్పుడైనా ఆలోచించారా?. అవును! ఇది నిజం.
పెన్సిల్ తయారీకి గ్రాఫైట్, చెక్క, మట్టి(క్లే), పెయింట్, రబ్బర్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవన్నీ వేర్వేరు దేశాల నుంచి వస్తాయి. పెన్సిల్‌లో నల్లగా కనిపించే భాగం లిడ్ కాదు. అది గ్రాఫైట్. దాన్ని క్లేతో కలిపి పేస్ట్‌గా తయారు చేసి, సన్నని స్టిక్స్ రూపంలో అచ్చు వేసి, అధిక ఉష్ణోగ్రతలో కాలుస్తారు. క్లే ఎక్కువైతే పెన్సిల్ హార్డ్(H) అవుతుంది. క్లే తక్కువైతే పెన్సిల్ డార్క్(B) అవుతుంది.
గ్రాఫైట్.. ఇండియా, చైనా, శ్రీలంకలో లభిస్తుంది. మన దేశంలో ఇది ప్రధానంగా జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొరుకుతుంది.
గ్రాఫైట్‌ను రక్షించడానికి దాని పైభాగంలో చెక్క ఉపయోగిస్తారు. ఈ చెక్క సాధారణంగా సెడార్(Cedar) అనే ప్రత్యేక చెట్టు నుంచి వస్తుంది. ఇది.. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా అడవుల్లో లభిస్తుంది. అలాగే.. రష్యా అడవుల్లో దొరికే ఇకో-సర్టిఫైడ్ చెక్కను ఉపయోగిస్తారు. పెన్సిల్ రబ్బర్లు ప్రధానంగా సింథటిక్ రబ్బర్(పెట్రోలియం ఆధారితం)తో తయారవుతాయి. దీనికి అవసరమైన ముడి పదార్థాలు ఇండియా, మలేషియా, మధ్యప్రాచ్య దేశాల నుంచి చైనాకు చేరతాయి. అక్కడ తయారీ జరుగుతుంది. అత్యున్నత నాణ్యత గల రబ్బర్లను (ప్రీమియం రబ్బర్లను) మాత్రం న్యాచురల్ రబ్బర్‌తో తయారుచేస్తారు. ఇవి.. థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతాయి.
క్లే అంటే మట్టి. ఇది గ్రానైట్, ఫెల్డ్స్‌పార్ వంటి రాళ్లు వాతావరణ ప్రభావంతో విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడుతుంది. క్లే ఎక్కువగా జర్మనీ, చైనా దేశాల్లో లభిస్తుంది. ఇండియాలో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు క్లే ఉత్పత్తిలో ముందుంటాయి. ఇలా మనం నిత్యం ఉపయోగించే పెన్సిల్ తయారీలో ఆసియా నుంచి గ్రాఫైట్, అమెరికా, బ్రెజిల్ నుంచి చెక్క, థాయ్‌లాండ్ నుండి రబ్బర్, జర్మనీ, చైనా నుంచి క్లే సహకారం దాగి ఉంది. చిన్న వస్తువులో కూడా ప్రపంచమంతా భాగస్వామి అవుతుందనే నిజాన్ని ఈ పెన్సిల్ మనకు నేర్పుతుంది. సహకారం, సమన్వయం, గ్లోబల్ యూనిటీ అనే పాఠాన్నీ చెబుతుంది.
పెన్సిల్ మన చేతిలో ఉన్నప్పటికీ దాని వెనక ఉన్న సహకారం ప్రపంచాన్ని ఒకే గీతతో కలుపుతుంది. ఒక చిన్న పెన్సిల్ మనిషి జ్ఞానానికి, ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీక. ఇది విద్యకు బలం. కళకు ఆయుధం. ప్రపంచానికి స్నేహ సేతు. చిన్నదే అయినా ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది.
- కోట దామోదర్
