ప్రధాని మోదీ (PM Modi) సోమవారం గోవాలోని ఐఎన్‌ఎస్ విక్రాంత్(INS Vikrant)ను సందర్శించి నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు (Diwali Celebrations) జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్‌ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక అని కొనియాడారు. దాని పేరు వింటేనే శత్రువులకు నిద్ర పట్టదని, గజగజ వణికిపోతారని అన్నారు. ఛత్రపతి శివాజీ ప్రేరణతో నావికాదళం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు.

మన దేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దీంతోపాటు గోవా, కార్వార్ పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ధైర్యవంతులైన నావికా దళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి రోజు సందడిగా గడిపారు. “ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఖచ్చితత్వం, పరాక్రమాన్ని ప్రదర్శించే అద్భుతమైన ఎయిర్ పవర్ డెమోను చూశాను. పగలు, రాత్రి రెండు సమయాల్లోనూ చిన్న రన్‌వేపై MiG-29 యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ నైపుణ్యం, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి ఉత్కంఠభరితమైన ప్రదర్శనగా నిలిచిందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
