- తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన ఉద్రిక్తతలు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. ఓవైపు యుద్ధానికి స్వల్ప విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. పొరుగు దేశాలపై దాడుల్ని తీవ్రతరం చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ అగ్ని గుండంగా మారింది. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 263.67 పాయిం ట్లు లేదా 0.35 శాతం క్షీణించి 73,319.55 దగ్గర స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 106.50 పాయింట్లు లేదా 0.47 శాతం పతనమై 22,713.10 వద్ద ముగిసింది.
అయితే రెండు రోజులు సెలవులు కావడం, సోమవారం భారీ నష్టాలను బుధ, గురువారాల్లోని లాభాలు కాస్త భర్తీ చేయడం కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఒడిదుడుకులకు వీలుందనే మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి సాధారణ స్థితికి రాకుండా పోతున్నది మరి. ఇదిలావుంటే ఈ వారం ట్రేడింగ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్ష కూడా ప్రభావితం చేయనున్నది.
