ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University)లో 108వ భారతీయ ఆర్థిక సంఘం(Indian Economic Association) వార్షిక సదస్సు(Annual Conference) ప్రారంభమైంది. వికసిత్ భారత్ (Viksit Bharat) @ 2047 లక్ష్యంగా సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. విద్యా వారసత్వం, ఆర్థిక దూరదృష్టి మేళవించిన ఒక చారిత్రాత్మక ఘట్టంలో భాగంగా దీనికి రూపకల్పన చేశారు. 1917లో స్థాపించిన ఓయూ 108 ఏళ్ల ఘన చరిత్రను సొంతం చేసుకోవటం, అదే సమయంలో దేశంలోని అత్యంత పురాతన ఆర్థిక సంస్థ భారతీయ ఆర్థిక సంఘం తన 108వ సదస్సును ఇక్కడ జరుపుకోవడం ఒక అరుదైన మైలురాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్(University College of Arts and Social Sciences) వేదికగా జరుగుతున్న ఈ ప్రారంభోత్సవంలో 27 రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు “వికసిత్ భారత్ @ 2047: అభివృద్ధి చెందిన దేశం దిశగా పురోగతిని ప్రతిబింబించడం” అనే కీలక ఇతివృత్తంపై చర్చించనుంది.
మేధో శిఖరాల కలయిక..
ఈ సదస్సుకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమిక రవి అధ్యక్షత వహించారు. తన ప్రసంగంలో.. భారత దేశ సమగ్ర వృద్ధి కోసం సమాచార ఆధారిత పాలన, నిర్మాణాత్మక సంస్కరణలు ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు. పేదరిక కొలమానాలు, జాతీయ విధాన రూపకల్పనలో “కథనాత్మక ఆర్థిక శాస్త్రం” ప్రాముఖ్యత గురించి సుదీర్ఘంగా వివరించారు.
ప్రధాన అతిథిగా విచ్చేసిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్, భారత ఆర్థిక విధాన రూపశిల్పి ఎన్.కె.సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య సవాళ్లను ఎదుర్కోవడంలో తన అనుభవాలను పంచుకున్నారు. 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో సమాఖ్య వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వం కీలక స్తంభాలని పేర్కొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి, సదస్సు నిర్వాహకుల్లో ముఖ్యులు ప్రొఫెసర్ కుమార్.. ప్రతినిధులకు స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయం డిజిటల్ పరివర్తనకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. దేశం.. జనాభా ప్రయోజనాలను పొందాలంటే నాణ్యమైన విద్య అవసరమని, పరిశోధకులు “ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం” వైపు దృష్టి సారించాలని కోరారు.
వేదికపై ప్రముఖుల ప్రసంగాలు
సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఐ.సి.ఎస్.ఎస్.ఆర్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ ధనంజయ్ సింగ్ కోరారు. సంస్థ పరిధిలోని వివిధ పథకాలను వివరించారు.
ఆధునిక సామాజిక శాస్త్ర పరిశోధనల్లో “భారతీయ జ్ఞాన వ్యవస్థ” అనుసంధాన ప్రాముఖ్యతను భారతీయ ఆర్థిక సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ తులసి బిరుంధ వరదరాజన్ వివరించారు.
ఐ.సి.ఎస్.ఎస్.ఆర్ దక్షిణ ప్రాంతీయ కేంద్రం ద్వారా ప్రాంతీయ పరిశోధనల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పుతూ ఈ సదస్సును విజయవంతంగా రూపొందించారని నిర్వహణ కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఆర్థిక లక్ష్యాల మధ్య సమన్వయం గురించి ఐపిఈ సంచాలకుడు ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస మూర్తి చర్చించారు.
గత శతాబ్ద కాలంగా భారత ఆర్థిక ఆత్మను తీర్చిదిద్దడంలో భారతీయ ఆర్థిక సంఘం పోషించిన పాత్రను సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ డి.కె.మదాన్ వివరించారు.
అక్షర రూపాలు
దేశవ్యాప్త పరిశోధకుల వందలాది పరిశోధనా వ్యాసాల సంకలనమైన “సదస్సు జ్ఞాపిక” ఆవిష్కరణ ఈ ప్రారంభోత్సవంలో ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటు పలువురు విద్యావేత్తలు రచించిన ఐదు కీలక గ్రంథాలను ఆవిష్కరించారు:
ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున నాయక్ సంయుక్తంగా రాసిన మూడు పుస్తకాలు: తెలంగాణ 2047 దార్శనికత: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణం’, ‘భారతదేశంలో పట్టణ ప్రణాళిక, ఆర్థిక అభివృద్ధి: 2050 దార్శనికత’, ‘ప్రపంచ వాణిజ్య నూతన శకం: సుంకాల యుద్ధాలు, భూగోళ రాజకీయాలు, భారతదేశ వ్యూహాత్మక ప్రతిస్పందన’. వీటితోపాటు డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున నాయక్ రాసిన ‘సుస్థిర శక్తి, సుస్థిర పురోగతి: తెలంగాణలో పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక మార్పు’, డాక్టర్ రమేష్ తేజవత్ రాసిన ‘భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తల స్థితిగతులు-తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రస్తావన’ గ్రంథాలను ఆవిష్కరించారు. ఉప నిర్వహణ కార్యదర్శి ప్రొఫెసర్ ఎం.రాములు కృతజ్ఞతాభివందనంతో కార్యక్రమం ముగిసింది.
