గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలోని జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అనుమతులు లేకుండా భారీ ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం అవుతుండటం స్థానిక ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ నిర్మాణాల వెనుక ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాల విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ తగిన చర్యలు లేకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కఠిన చర్యలు చేపట్టకపోవడం వెనుక కారణాలు ఏంటన్న చర్చ బాలాజీ నగర్ పరిధిలో సాగుతోంది. అక్రమ నిర్మాణాల వల్ల రహదారి విస్తరణకు ఆటంకం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా బాలాజీ నగర్ వికలాంగుల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని భారీ పిల్లర్స్ తో నిర్మాణాలు కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికలాంగుల కాలనీకి వెళ్లే దారిలో ఈ విధమైన అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని కాలనీవాసులు చెబుతున్నారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను పక్కనపెట్టి అక్రమాలకు మౌన సమ్మతి ఇస్తున్నారా అంటూ జిహెచ్ఎంసి అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే అక్రమ నిర్మాణాలపై సమగ్ర సర్వే నిర్వహించి నిబంధనలకు విరుద్ధమైన భవనాలపై కూల్చివేత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాలాజీ నగర్ ప్రాంతంలో చట్టపాలనను కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.

