ఏపూరి గ్రామంలో జరిగిన హత్య కేసు ఛేదించిన పోలీసులు
భార్య నడవడిక సరిగాలేకే కుటుంబ గౌరవం కోసం దారుణ హత్య
ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్
సూర్యాపేట: ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరి గ్రామంలో మంగళవారం పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను గురువారం సూర్యాపేట డీఎస్పీ (Suryapet Dsp) కార్యాలయంలో డిఎస్పి ప్రసన్నకుమార్ వివరించారు. కోరివి భిక్షమమ్మ(40) మరో గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం (Illegal Affair) కొనసాగిస్తోందని, దీనిపై భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా మారకపోవటంతో అక్టోబర్ 21న ఉదయం పంచాయితీ పెట్టారు.
భిక్షమమ్మ తన అక్రమ సంబంధాన్ని నిలిపివేయబోనని చెప్పడంతో భర్త మల్లయ్య.. కుమారులు భరత్, ప్రగణ్, బంధువులు మహేష్, వంశీలతో కలిసి ఆమెను చంపేందుకు పథకం (Plan) రచించారు. పంచాయితీ ముగిసిన కొద్దిసేపటికే ఆమె ఇంటికి వెళ్తుండగా పూసుపల్లి జనార్థన్ అడ్డగించాడు. సమాచారం అందుకున్న మహేష్, వంశీ కారుతో ఆమెను ఢీకొట్టి కింద పడ్డాక మహేష్ గొంతు కోసి, వంశీ ఛాతీపై గాయపరచడంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, డీఎస్పీ ఆధ్వర్యంలో సూర్యాపేట సీఐ జి.రాజేశ్వర్, ఎస్సై ఎస్.ఎ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కారు, బైక్, స్కూటీ, ఆటో సహా ఐదు వాహనాలను సీజ్ చేశారు. ఈ సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్ గౌడ్, మహేశ్వర్ ఉన్నారు.
