Tuesday, October 28, 2025
ePaper
Homeజాతీయంకుంభమేళాకు భారీగా భక్తుల రాక

కుంభమేళాకు భారీగా భక్తుల రాక

55 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటన

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని పేర్కొంది. దేశ విదేశాల నుంచి భారీగా సామాన్యులు, ప్రముఖులు తరలి వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన ఈ ఆధ్యాత్మిక సంబరం ఫిబ్రవరి 26వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. భారత్‌లోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించారని తెలిపింది. ఫిబ్రవరి 26నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తొలుత కుంభమేళాకు 45 కోట్ల మంది మాత్రమే వస్తారని అంచనా వేయగా.. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తుతుండటం గమనార్హం. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మార్కును అధిగమించి.. తాజాగా 55 కోట్ల మార్కును చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు రాగా.. మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. సంబంధిత ఫొటోను ఆయన ’ఎక్స్‌’లో షేర్‌ చేశారు. మహా కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మత, ఆధ్యాత్మిక వేడుక అన్నారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా పేర్కొన్నారు. దేశం ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని గంగామాతను ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే గడ్కరీ దంపతులు కూడా పుణ్యస్నానాలు ఆచరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News