- అధికారుల వ్యవహారంపై తలెత్తిన ప్రశ్నలు.
- సమయం దాటిన తరవాత వచ్చిన అభ్యర్థి.
- మెన్ డోర్ వరకు వచ్చిన మహిళ.
- నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఉద్రిక్త వాతావరణం.
- పోలీసుల జోక్యంతో సర్దుమడిగిన పరిస్థితి.
- ఎంపీడీఓ కు పలువురు అభ్యర్థుల ఫిర్యాదు.
చివ్వెంల మండల కేంద్రంలోని సర్పంచ్, వార్డు మెంబర్ నామినేషన్ కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఓ వార్డు మెంబర్ అభ్యర్థి సమయం దాటాక కేంద్రంలోకి రావడంతో అక్కడ కొంత గడబిడ అయ్యింది. సూర్య నాయక్ తండ గ్రామపంచాయతీ 5వ వార్డు అభ్యర్థి దారావత్ నీల నామినేషన్ సమయం ముగిసిన తర్వాత సుమారు సాయంత్రం 7:40 గంటలకు కేంద్రానికి రావడంతో వివాదం తలెత్తింది.నామినేషన్ పత్రాల పరిశీలనలో అధికారులకి, అభ్యర్థి ఒక షీట్‌పై ఇంగ్లీషులో సంతకం, మరొక షీట్‌పై తెలుగులో సంతకం చేసినట్లు గమనించడంతో, సంతకాల ట్యాలీలో స్పష్టత కోసం గ్రామ కార్యదర్శి ఆమెను ఫోన్ ద్వారా కేంద్రానికి రావాలని కోరినట్లు తెలిసింది. ఆ మహిళ నేరుగా గేటు దాటి, నామినేషన్ కేంద్రంలో ప్రధాన గడప వరకు రావడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

ఏడున్నర గంటల తరువాత వార్డు అభ్యర్థికి అనుమతి.?
ఇదంతా అక్కడే ఉన్న ఇతర అభ్యర్థుల చూసి, ఇతరులకు సమాచారం ఇవ్వడంతో వారు సెంటర్ వద్దకు వచ్చి, గేటు సాయంత్రం 5 గంటలకు మూసేయాలి కదా.! అయితే ఈ సమయంలో ఎలా లోపలికి అనుమతించారు? అంటూ వారు అధికారులను నిలదీశారు. నామినేషన్ సమయానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తత దారితీస్తుండంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ మహిళను బయటికి పంపించారు.ఈ సంఘటన సమాచారంతో ఇతర వార్డు అభ్యర్థులు కూడా వెంటనే కేంద్రానికి చేరుకుని గుమిగూడారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిబ్బంది సమాచారంతో స్థానిక ఎస్సై మహేశ్వర్, మండల ఎన్నికల అధికారి (ఎంపీడీవో) సంతోష్‌కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆర్ఓ వస్త్రం నుంచి ప్రాథమిక నివేదికను కూడా కోరినట్లు తెలిసింది.
అభ్యర్థుల సంతకాల విషయంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, నామినేషన్ స్వీకరణలో అధికారులు అలసత్వం వహించారని, నిబంధనలు పట్టించుకోవడంలేదని అభ్యర్థులు తీవ్రంగా విమర్శించారు. దీంతో అక్కడ కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ, పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మండల ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు:
ఈ ఘటన నేపథ్యంలో సూర్య నాయక్ తండాకు చెందిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ సంఘటన అనంతరం మండల ఎన్నికల అధికారి (ఎంపీడీవో)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నామినేషన్ సమయం ముగిసిన తర్వాత అధికార పార్టీ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి కావాలనే పిలిపించారని, ఇది ఎన్నికల నిబంధనల స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆర్‌ఓ వస్త్రం నుంచి వివరణ కోరగా.. సాయంత్రం ఐదు తర్వాత స్వీకరించిన నామినేషన్లను పిడిఎఫ్ చేస్తున్న సమయంలో సంతకాల ట్యాలీలో అనుమానం రావడంతో , గ్రామ కార్యదర్శి అభ్యర్థిని ఫోన్ ద్వారా పిలిచినట్లు వెల్లడించారు. అయితే ఆమె లోపలికి రాకముందే పోలీసులు ఆమెను బయటికి పంపినట్లు తెలిపారు.
ఈ మొత్తం ఘటనతో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని, అధికారులు పారదర్శక వ్యవహారంపై పలు రకాల ప్రశ్నలు తలెత్తాయి.
