మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ పురస్కారం
‘బిజినెస్ టుడే’ నుంచి స్వీకారం
ముంబైలో జరిగిన కార్యక్రమం
శాశ్వత సంస్థల నిర్మాణమే నిజమైన నాయకత్వమని వెల్లడి
భారత్‌లో మహిళా నేతలను ప్రోత్సహించడంపై బిజినెస్ టుడేకు ప్రశంసలు
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బ్రహ్మణి
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (Executive Director of Heritage Foods) నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ (Business Today) ఏటా అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ (Most Powerful Women in Business) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డు స్వీకరించారు.
ఈ విషయాన్ని నారా బ్రాహ్మణి స్వయంగా వెల్లడించారు. ఈ గుర్తింపు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాయకత్వంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచిపోయే సంస్థలను నిర్మించడం, బాధ్యతాయుతంగా విలువను సృష్టించడం, ఈ క్రమంలో ప్రజలను శక్తివంతం చేయడమేనని పేర్కొన్నారు.
ఈ అవార్డుకు ఎంపిక చేసిన ‘బిజినెస్ టుడే’కి నారా బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా నేతలను ప్రోత్సహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎన్‌ఎస్‌ఈ ఇండియాలో తన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
నారా బ్రహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు తండ్రి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ బోర్డ్ మెంబర్(Basavatarakam Cancer Hospital Trust Board Member)గానూ సేవలందిస్తున్నారు.
