నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలోగుర్తు తెలియని దుండగులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై హనుమాన్ భక్తులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. రామాలయం ముందు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎడమ చేతి గదను గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులతో పాటు పలువురు హిందూ సంఘాల నాయకులు ఘటన స్థలానికి చేరుకొని నిరసన చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాంపల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విగ్రహం ధ్వంసం చేయడం దురదృష్టకరమని, ఘటనకు పాల్పడినవారిపై దర్యాప్తు చేసి కఠినచర్యలు తీసుకుంటామని ఆందోళనకారులను శాంతింపజేశారు.
