- పాల్గొన్న డీసీపీ, ఏసీపీలు
జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వాస్తు గణపతి దేవాలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బాలాజీ పూనంచంద్ (స్వీట్ హౌస్) ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్ (ఐపీఎస్) పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, హనుమాన్ జయంతి పర్వదినం భక్తి, సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీ హనుమంతుని ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు సమాజంలో సేవా తత్వాన్ని పెంపొందిస్తాయని, భక్తుల ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు.
అలాగే ఏసీపీ పండరి చేతన్ నితిన్ (ఐపీఎస్) మాట్లాడుతూ, భక్తి మార్గంలో నడవడం మనకు ఆత్మశాంతిని ఇస్తుందని, హనుమంతుడి భక్తి, శక్తి మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ అన్నప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ప్రదీప్, హనుమాన్, నాగరాజు, శ్రీకాంత్, శివుడు, నవీన్, సంతోషిని, స్వాతి తదితరులు పాల్గొన్నారు. భక్తులు “జై శ్రీరామ్… జై జై సీతారామ్… జై హనుమాన్” అంటూ నామస్మరణ చేస్తూ ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని, భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని తెలిపారు.
