- ఆకాశాన్ని తాకే తాటిచెట్ల మీదే వారి జీవన పోరాటం?
- చట్టాలు ఎన్నో.. హామీలు ఎన్నో.. కానీ వాస్తవంలో మాత్రం శూన్యం
- శాసించే స్థాయిలో గౌడ నాయకులు ఉన్నా న్యాయం కరువు..
- ఎక్స్‌గ్రేషియా శాంక్షన్ అవుతుంది.. కానీ నిధులు లేవంటారు..
- యాదాద్రి జిల్లాలోనే దాదాపు రూ. 3కోట్లు ఎక్స్ గ్రేషియా పెండింగ్
- రాష్ట్రవ్యాప్తంగా లెక్కనేంత.. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న బాధితులు
- గౌడ కుటుంబాల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్న గౌడ బాధిత కుటుంబాలు..
సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు.. గోచీ కడతాడు.. తలపాగా ధరిస్తాడు మోకును భుజానికి వేసుకుంటాడు.. హుషారుగా గీతాలు పాడుకుంటూ.. కల్లుగీత కోసం బయలుదేరతాడు.. ఆకాశాన్ని అంటే తాటిచెట్లను అవలీలగా ఎక్కేస్తాడు.. రుచికరమైన పొద్దాటు కల్లు కుండల్లో దించుతాడు.. కల్లుప్రియుల దాహార్తిని తీరుస్తాడు.. ఇంత చేసినా ఆయనకు వచ్చేది కాస్త చిల్లర మాత్రమే.. అయినాసరే తన వృత్తిధర్మాన్ని ఎప్పుడూ విస్మరించడం లేదు.. కష్టమైనా నిష్టూరమైనా తన పని తాను చేసుకుంటూ వెళ్తుం టాడు..
ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటాడు.. కానీ కల్లుగీత కార్మికుల జీవనమే మరీ దుర్భరంగా ఉంది.. ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలియదు.. చెట్టుమీద ఎప్పుడు కాలు జారుతుందో తెలియదు.. ఎప్పుడు మోకు తెలుగుతుందో తెలియదు.. గీతన్నల జీవితాలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ ప్రభుత్వాలు చేస్తున్న వాగ్ధానాల జడిలో గీత కార్మికుల జీవితాలు తడుస్తున్నాయి తప్ప గాడిలో పడుతున్న దాఖలాలు కనిపించకపోవడం దురదృష్టం..

గీత కార్మికులు తమ వృత్తిలో భాగంగా కళ్ళు గీయడానికి వెళ్లే గీత కార్మికులకు అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి.. అకారణంగా ప్రాణాలు పోతుంటాయి.. పోషించే కుటుంబ పెద్ద అకాలమరణం చెందితే.. కుటుంబాలు వీధిన పడతాయి.. కల్లుగీత కార్మికులను ఆదుకుంటాం అంటూ ఎప్పటికప్పుడు కబుర్లు చెప్పే ప్రభుత్వాలు, రాజకీయ పెద్దలు.. మాటల వరకే పరిమితం అవుతున్నాయి.. కానీ గీత కార్మికుల తరఫున ఎవరూ లేరంటే అదికూడా కాదు.. పెద్ద పెద్ద స్థాయిల్లో గౌడ ప్రముఖులు ఉన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో గౌడన్నల పరిస్థితి మరీ దారు ణంగా ఉంది.. కుంటుంబాన్ని పోషించే పెద్ద కనుమరుగైపోతే.. కుటుంబాలను ఆదుకునే నాథుడు లేక విలవిలలాడి పోతున్నారు.. తమగోడు ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాక కుమి లిపోతున్నారు..

ఉదాహరణకు చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్లుగీత కుటుంబ యజమాని ఆకస్మిక మరణం పాలైన బాధిత కుటుంబాలు దాదాపు 79 వరకు ఉన్నాయి.. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్రేషియా ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.. వారందరికీ ఎక్స్ గ్రేషియా శాంక్షన్ కూడా అయ్యింది.. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనే కారణం చూపిస్తున్నారు.. సుమారు 277.40 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి.. గడచిన మూడు సంవత్సరాలుగా డబ్బులు కోసం కళ్ళు కాయలు కాచేలా బాధిత కుటుంబాలవారు ఎదురు చూస్తున్నారు..

తెలంగాణ రాష్ట్రంలో ఒక గౌడ ప్రముఖుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.. ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రి అంతటి వారు.. మరో ప్రముఖుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.. ఎందరో గౌడ ప్రముఖులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.. వివిధ రకాల గౌడ సంఘాలు కూడా ఉన్నాయి. వారంతా గౌడుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబు తుంటారు.. వాస్తంలోకి వస్తే కథ వేరే విధంగా కనిపిస్తుంది.. అలాగే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ లాంటి వారున్నారు.. కానీ వీరెవ్వరు కూడా గౌడ సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవు.. మరి ఎవరు వీరిని ఆదుకోవాలి..
గీతన్నల దుర్మరణాలపై ఎక్కడో ఒకచోట విషాద వార్తలు తరచూ వెలుగు చూస్తూనే = ఉన్నాయి? ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి సంతాపం తెలపడం.. – పనికిరాని హామీలు ఇవ్వడం.. చట్టాలు మారుస్తాం? అమలు చేస్తాం. ఆదుకుంటాం. అని కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. ఇది నాయకులు చేస్తున్న ఆర్భాటం.. ప్రమాదాలు జరిగి కొన్ని రోజులు గడిచాక హామీలన్నీ మరిచిపోతారు. చట్టాలు అటకెక్కుతాయి. బాధిత కుటుంబాలు మౌనంగా మిగిలిపోతాయి.

నిన్నటికి నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో గీతన్న ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఒక్క ఘటనే కాదు ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు నిత్యం మన కళ్ళముందు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఏమి చేస్తోంది.. అన్నదే ఈరోజు సమాజం ముందు నిలిచిన ప్రశ్న గౌడ సంఘాల నాయకులు నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రముఖులైన గౌడ నాయకుల్లో స్పందన లేదు.. మరణించిన గౌడన్నల కుటుం బాలకు రూ. 5 లక్షల ఎక్స్రేషియా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం శాంక్షన్ అయిందని పేపర్ మీద లెక్కలు వేసి చెబు తోంది. కానీ నిధులు విడుదల కావడం లేదు. యాదాద్రి భువన గిరి జిల్లాలో గత మూడేళ్లుగా ఇదే తతంగం జరుగుతోంది..
నిజంగా గౌడన్నల సంక్షేమానికి నిధులు లేవా..? లేదా ఉన్నా ఇవ్వడానికి మీన మేషాలు లెక్కబెడుతున్నారా..? రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల ఎక్స్రేషియా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది.

రాజకీయంగా గౌడ్లకు ప్రాతినిధ్యం లేదా.. అంటే ఉంది. మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు అయినా సరే తమ వర్గానికి ఎందుకు మేలు చేయలేకపోతున్నారు.. తమవారి హక్కులను ఎందుకు సాధించుకోలేకపోతున్నారు.. బడ్జెట్లో తగిన కేటాయింపులు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు.. ఇది చేతకానితనమా..? లేదా అధికారానికి లొంగిపోయారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. గౌడన్నల జీవితాలు ఇలాగే గాలిలో వేలాడుతాయా.. వారి కుటుంబాల కన్నీళ్లకు ఎప్పుడైనా సమాధానం దొరుకుతుందా.
గౌడన్నల సంక్షేమం నిజంగా సాధ్యమవుతుందా..?
దురదృష్టం ఏమిటంటే ఇంతమంది ఉన్నా ‘ మరణించిన గౌడ కుటుంబాలవారికి ఎక్స్ గ్రేషియా – ఇప్పించుకోలేని దారుణ పరిస్థితుల్లో ఉన్నారా.. అనే – అనుమానం తలెత్తుతోంది.. బ్రతికున్నపుడు ఎప్పుడూ గౌడన్నల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదు.. కనీసం ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితి ఎందుకు ఉంది.. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది..
కొసమెరుపు ఏమిటంటే ఒక బహిరంగసభలో టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.. మన సీఎం రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్.. ఆయన మనకు అండగా ఉంటారు.. మనకు ఇంకా ఎలాంటి సమస్యలున్నా తీరుస్తారు.. అని చెప్పారు.. మరి ఇప్పుడేమైంది.. ఎందుకు ముఖ్యమంత్రిని ఒప్పించి గౌడన్నలకు అందవలసిన ఎక్స్ గ్రేషియా ఇప్పించుకోలేకపోతున్నారు.. దీనికి సమాధానం చెప్పగలరా అని గౌడన్న కుటుంబాలవారు ప్రశ్నిస్తున్నారు..

తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో మరణించిన గౌడన్నల కుటుంబాలను ఆదుకోవాలి.. తక్షణమే పెండింగ్లో ఉన్న దాదాపు రూ. 3 కోట్ల నిధులను విడుదల చేసి ఆ కుటుంబాలకు చెల్లించాలి.. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడుతాం..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి :
링 బావమరిది పొనగాని రవీందర్, గ్రామం తుక్కాపురం, ఆత్మకూరు మండలం 2023 మార్చిలో వృత్తిలో భాగంగా పనిచేస్తూ తాడిచెట్టు నుంచి పడి మరణించాడు.. ఇప్పటివరకు కుటుంబానికి ఎటువంటి ఎక్స్రేషియా అందలేదు.. గత ప్రభుత్వంలో ఎదురుచూచి వేసారిపోయాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలి..
