- అభినందనలు తెలిపిన పలు రాష్ట్రాల నేతలు
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ అధ్యక్షుడుగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు గోపాల్ మిశ్రా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గత సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ సోమవారం న్యూఢిల్లీలో ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్ డబ్ల్యూజే, అనుబంధ సంఘాల ప్రతినిధుల ఓటింగ్ ద్వారా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ప్రధాన ఎన్నికల అధికారి(సీఆర్ఓ) సంతోష్ చతుర్వేది (ఉత్తర ప్రదేశ్), సహాయ ఎన్నికల అధికారులు (ఏసీఆర్ఓ) మామిడి సోమయ్య (తెలంగాణ), మరూఫ్ రజా (ఢిల్లీ)తదితరులు ఈ ఎన్నికలను నిర్వహించారు.
అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నికను న్యూఢిల్లీలోని నిజాముద్దీన్, బి-35 లో ఉన్న జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ ఢిల్లీ (జేయూడీ) ప్రాంగణంలో జరిగిన ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. గత సంవత్సరం వరకు అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కే. విక్రమరావు మరణించడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు గోపాల్ మిశ్రా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులు రెండు వైపుల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు.ఒకవైపు ఆదాయ వనరుల పతనం వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం పెరగడం వల్ల న్యూస్ రూమ్ ల పనితీరు గందరగోళంలో పడిందని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు అకారణంగా తమ జీవనోపాధిని కోల్పోకుండా చూడటం మన మొదటి కర్తవ్యమని అన్నారు. డిజిటల్ శ్రమ వాస్తవికతను ప్రతిబింబించే వేతన రక్షణను సాధించడం మన రెండవ కర్తవ్యమని గోపాల్ మిశ్రా అన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని అన్నారు. ఏఐఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా హాజరై, స్వర్గీయ డాక్టర్ విక్రమ్ రావును జర్నలిస్టుల శ్రేయస్సు కోసం అందించిన సేవలను కొనియాడారు.ఐఎఫ్‌డబ్ల్యూజే అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు గోపాల్ మిశ్రాను అభినందించారు.

ఆయన తన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, డాక్టర్ కె. విక్రమ్ రావు చూపిన మార్గంలో నడవాలని కోరారు. నూతనంగా ఎన్నికైన ఐఎఫ్ డబ్ల్యూజే అధ్యక్షుడు గోపాల్ మిశ్రా ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికలలో సీనియర్ సంపాదకీయ పదవులను నిర్వహించారు. భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ న్యూస్ పోర్టల్‌ను ప్రారంభించారు.
మాజీ రాష్ట్రపతి వి.వి. గిరిచే గుర్తింపు పొందిన పయనీర్ ఎంప్లాయీస్ యూనియన్ను స్థాపించారు. రెండు రోజుల పాటు జరిగిన ఐఎఫ్‌డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సమావేశాల్లో సీనియర్ వర్కింగ్ కమిటీ సభ్యులు, జాతీయ ఉపాధ్యక్షుడు ఉపేంద్ర సింగ్ రాథోడ్, కోశాధికారి రజత్ మిశ్రా, కార్యదర్శులు పి. ఆనందం, కె. విశ్వదేవరావు, రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ (మధ్యప్రదేశ్) తదితరులు,ఢిల్లీ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హసీబ్ సిద్ధిఖీ, దేవరాజ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), ప్రమోద్ దత్, సుధీర్ మధుకర్(బీహార్), సి. భూపతి(తమిళనాడు), భరత్ భూషణ్, దీపక్ కుమార్ (జార్ఖండ్), నమిత బోరా (అస్సాం), శాంత కుమారి, నారాయణ్ వైద్య(కర్ణాటక), ఓం ప్రకాష్ సింగ్, ముఖేష్ కుమార్ (మహారాష్ట్ర), బిజోయ్ పాల్ (త్రిపుర), అమిత్ రాయ్ (పశ్చిమ బెంగాల్), అరుణ్ శర్మ, ప్రయాగ్ పాండే (ఉత్తరాఖండ్), సీనియర్ పాత్రికేయులు ప్రేమ్ కాంత్ తివారీ, నితిన్ శ్రీవాత్సవ (ఉత్తరప్రదేశ్) తదితరులు కొత్త అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.
