- గర్భంలోనే శిశువు మృతి
- వైద్యులపై సస్పెన్షన్ వేటు.
- రూ. 15 లక్షల స్కానింగ్ మెషిన్ ఉన్నా రేడియాలజిస్ట్ లేని వైనం.
గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భంలోని శిశువు మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. గోదావరిఖని సెవెన్ ఎల్ బి కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు కొంపెల్లి లింగయ్య కుమార్తె సుప్రియ డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆమెకు ఉమ్మనీరు పోతున్నట్లు ఎన్నిసార్లు చెప్పినా డ్యూటీ డాక్టర్లు పట్టించుకోలేదు.స్కానింగ్ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి పంపగా,అప్పటికే గర్భంలో శిశువు మరణించినట్లు తెలిసింది.
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు.రూ.15 లక్షల వ్యయంతో స్కానింగ్ మిషన్ ఉన్నప్పటికీ,రేడియాలజిస్ట్‌ను నియమించకపోవడం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడుతోంది. నిర్లక్ష్యానికి పాల్పడిన వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు.
నిరసన నేపథ్యంలో దిగివచ్చిన హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ అంబిక..డ్యూటీ డాక్టర్,గైనకాలజిస్ట్ ఇద్దరిపై సస్పెన్షన్ సిఫారసు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సంఘటన గురించి తెలుసుకున్న ఆర్జీ-1 జిఎం లలిత్ కుమార్ జోక్యం చేసుకుని, డైరెక్టర్ పర్సనల్ తో ఫోన్లో మాట్లాడగా.. తక్షణమే రేడియాలజిస్టులను నియమించుకోవాలని ఆసుపత్రి సూపరిండెంట్‌కు డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
