సూపర్వైజర్ అవినీతి బాగోతంపై అధికారుల మౌనం ఎందుకు?
- జీహెచ్ఎంసీని అక్రమాల అడ్డాగా మార్చిన సూపర్వైజర్ అర్జున్!
- లక్షల్లో లంచాలు… నిస్సిగ్గుగా ఉద్యోగాల మోసం!
- యూపీఐ లావాదేవీల్లో దొరికిన ఆధారం..
- పనిచేయని వారికి హాజరు, నిజాయితీపరుల నెత్తిన టోకరా!
- ట్రేడ్ లైసెన్స్ పేరుతో వ్యాపార సంస్థల నుంచి భారీగా వసూళ్లు!
- స్పష్టమైన ఆధారాలున్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఫైర్
- కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు, పౌరుల డిమాండ్, విజిలెన్సు ఫిర్యాదు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వ్యవస్థపై మరోసారి అవినీతి మరక పడింది. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రణాళికలో ఉన్న కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ, వ్యవస్థకే అప్రతిష్ట తీసుకొస్తున్నారు. ముఖ్యంగా, సర్కిల్ 7, సంతోష్ నగర్ పరిధిలో శానిటరీ సూపర్వైజర్ పనిచేస్తున్న ఆర్. అర్జున్ (ఎంప్లాయ్ నెం. 18203) పై వచ్చిన తీవ్ర అవినీతి, మోసం, అధికార దుర్వినియోగం ఆరో పణలు నగర పౌరుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫిర్యాదులు, ఆధారాలు ఉన్నా.. ఉన్నతాధికారులు ఇంతవరకు నిష్క్రియాత్మకంగా ఉండటం పౌర సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.

ఉద్యోగాల పేరుతో నిస్సిగ్గుగా మోసం..
జీహెచ్ఎంసీలో ఉద్యోగం ఇప్పిస్తానని అమాయ కులను నమ్మించి, శానిటరీ విభాగపు సూపర్వైజర్ ఆర్. అర్జున్ లక్షల్లో లంచాలు వసూలు చేసినట్లు స్పష్టమైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మెడికల్ బోర్డు నుండి డిప్యూటేషన్పై వచ్చిన అర్జున్, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దారుణాలకు ఒడిగట్టాడు. ఎన్. ధనలక్ష్మి మరియు ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇస్తానని రూ. 3,00,000/- డిమాండ్ చేసి, డబ్బులు తీసుకొని మోసం చేశారు. అలాగే ? తిమ్మప్ప అనే వ్యక్తి నుండి కూడా ఇదే విధంగా రూ. 3,80,000/- వసూలు చేసి, ఉద్యోగం ఇవ్వకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా వేదించాడు.. ?సద్దాం హుస్సేన్ అనే జీహెచ్ఎంసీ ఉద్యోగి నుండి విధుల్లో చేరేందుకు లంచం తీసుకున్నారని, దీనికి యూపీఐ లావాదేవీల రూపంలో ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది ఆధునిక సాంకేతికతను సైతం అవినీతికి ఎలా వాడుకుంటున్నారో తెలియజేస్తుంది. రమ్లీ అనే వ్యక్తి నుంచి కూడా ఉద్యోగం పేరిట రూ. 1,50,000/- లంచం తీసుకున్నట్లు ఆరోపణ ఉంది.

బయోమెట్రిక్ దొంగ హాజరు!
అవినీతి ఒక్క ఉద్యోగాల మోసంతోనే ఆగలేదు. సూపర్వైజర్ అర్జున్ తమ కుటుంబ సభ్యులను, బంధువులను శానిటేషన్ వర్కర్లుగా పనిలో పెట్టి, వారికి హాజరు వేయించి, అసలు పని చేయకుండానే వేతనాల రూపంలో ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. శానిటేషన్ కార్మికులైన ముదవత్ మహేష్, ఎన్. బొంతమ్మ, మసయ్య, లక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్ హెచ్) వంటి వారి హాజరును తారుమారు చేసి, పని చేయనివారికి అటెండెన్స్ వేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ?నిజంగా పనిచేసే కార్మికులను భయపెట్టి, హాజరు వేయించేందుకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నారంటే, ఈ విభాగంలో లోపాలు ఎంత బరితెగించాయో అర్థం చేసుకోవచ్చు.

వ్యాపార సంస్థల నుంచి దండుకుంటూ…
ట్రేడ్ లైసెన్స్ లేని మార్కెట్ షాపులు, హాస్టళ్లు, జిమ్ములు, హెూటళ్లు వంటి వ్యాపార సంస్థల నుండి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు, ఈ సూపర్వైజర్ అవినీతిని బహుముఖ బయట పెడుతున్నాయి. ఇతని డిప్యూటేషన్ కాలం నాలుగేళ్లు పూర్తయినా, ఇంకా అదే విభాగంలో కొనసాగడం వెనుక కూడా ఇదే ‘లంచం’ కారణమై ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఎందుకు?
ఇంతటి నిస్సిగ్గుగా అవినీతి, మోసం, అధికార దుర్వినియోగం జరిగాయని స్పష్టమైన ఆధారాలు, ఫిర్యాదులు కమిషనర్, జోనల్ కమిషనర్ వంటి ఉన్నతాధికారులకు అందినప్పటికీ, ఇంతవరకు సూపర్వైజర్ ఆర్. అర్జున్పై కనీసం సస్పెన్షన్ చర్య కూడా తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ”శానిటేషన్ విభాగంలో అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇంత ఘోరమైన తప్పిదాలు జరుగుతున్నా, అర్జున్కు ఉన్నతాధికారుల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలుస్తోంది. బాహాటంగా కార్మికులు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి?” అని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
నిజాయితీగా పనిచేసే సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, అక్రమార్కులను ప్రోత్సహించే ఈ వైఖరిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మానుకోకుంటే, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోవడం ఖాయం. ఫిర్యాదుదారులు విజిలెన్స్ కమిషనర్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లకు కూడా ఈ ఆధారాలను సమర్పించారు. తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, అక్రమాలకు పాల్పడిన ఆర్. అర్జున్ను వెంటనే విధుల నుండి తొలగించాలని, ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన ఇతర అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు, పౌరులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక శానిటరీ సూపర్వైజర్ స్థాయిలోనే ఇంతటి అవినీతి రాజ్యమేలితే, జీహెచ్ఎంసీలో ఉన్నత స్థాయిల్లో పరిస్థితి ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్, ఈ వ్యవహారంపై ఇప్పటికైనా ఘాటుగా స్పందించి, అక్రమార్కులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శానిటరీ సూపర్వైజర్ అర్జున్ చేసిన మరిన్ని అవినీతి అక్రమాలు మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతి పై అస్త్రం.
