ఇండియా(India), న్యూజిలాండ్(New Zealand) దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(Free Trade Agreement-FTA) కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాల ప్రధానులు డిసెంబర్ 22న సోమవారం ఉమ్మడిగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, భాగస్వామ్య అవకాశాలను పెంచుకోవడానికి ఎఫ్‌టీఏ(FTA) ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత ప్రధాని మోదీ(PM Modi), న్యూజిలాండ్ ప్రధాని క్రిష్టోఫర్ లక్సన్(Christopher Luxon) మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్.. ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు ఎఫ్‌టీఏ చర్చలు ప్రారంభమయ్యాయి. తర్వాత.. తొమ్మిది నెలల రికార్డు సమయంలో ముగియటం విశేషం. దీన్నిబట్టి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలనే ఉమ్మడి ఆశయం, రాజకీయ సంకల్పాన్ని ఈ ఒప్పదం ప్రతిబింబిస్తోందని ప్రధానులు ఇద్దరు పేర్కొన్నారు.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు గణనీయంగా పెరుగుతాయి. మార్కెట్‌లోకి ఉత్పత్తులను ప్రవేశపెట్టే మార్గాలు మెరుగుపడతాయి. పెట్టుబడి ప్రవాహాలకు ప్రోత్సాహం లభిస్తుంది. వ్యూహాత్మక సహకారం బలోపేతం అవుతుంది. వివిధ రంగాల్లో రెండు దేశాల ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, రైతులు, MSMEలు, విద్యార్థులు, యువతకు సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఎఫ్‌టీఏ వల్ల రానున్న ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అవుతుందని మోదీ, లక్సన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి ఇండియా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. క్రీడలు, విద్య, ప్రజా సంబంధాలు వంటి ద్వైపాక్షిక సహకార రంగాల్లో ఇప్పటికే ఇరు దేశాలు సాధించిన పురోగతిని ప్రధానులు స్వాగతించారు. ఇండియా-న్యూజిలాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిబద్ధతతో కూడిన ప్రయత్నాలు కొనసాగుతాయని పునరుద్ఘాటించారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇండియాకి జరిగే న్యూజిలాండ్ ఎగుమతుల్లో 95 శాతం వస్తువులపై సుంకాలు తగ్గుతాయి. కొన్నింటిపై పన్నులు పూర్తిగా రద్దవుతాయి. రానున్న రెండు దశాబ్దాల్లో ఇండియాకి న్యూజిలాండ్ ఎగుమతులు ఏటా 1.1 బిలియన్ యూఎస్ డాలర్ల నుంచి 1.3 బిలియన్ యూఎస్ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని క్రిష్టోఫర్ లక్సన్ పేర్కొన్నారు.
వాణిజ్యం పెరగటం వల్ల న్యూజిలాండ్‌లో మరింత మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అధిక వేతనాలు అందుతాయి. కష్టపడి పనిచేసే న్యూజిలాండ్వాసులకు మరిన్ని అవకాశాలు దొరుకుతాయని లక్సన్ అన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య బలమైన స్నేహంపై ఆధారపడి ఉందని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇండియాలోని 1.4 బిలియన్ వినియోగదారులకు కివీస్ వ్యాపారాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
