- ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి బంగారు దశ మొదలైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు.బుధవారం నల్గొండ పట్టణంలో రూ. 50 కోట్ల విలువైన సాగర్ ఎక్స్‌రోడ్ – దర్వేశిపురం ఫోర్ లేన్ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్‌తో కూడిన ఈ అత్యాధునిక రహదారి పనులు వారం రోజుల్లోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు.
ఇప్పటికే దర్వేశిపురం వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం రూ. 12 కోట్లతో సీసీ రోడ్డు, లైటింగ్, మీడియన్‌ను నిర్మించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. జిల్లాలోని కొత్తపల్లి –ముషంపల్లి సహా అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు వేగంగా జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయంతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, నల్గొండలో దశలవారీగా ఇల్లు లేని కుటుంబాలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.ఎం.ఆర్.పి. (AMRP) కాలువల లైనింగ్‌కు ప్రభుత్వం రూ. 450 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం, కాలువల నిర్మాణం, మహిళలకు రైస్ మిల్లుల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు, డిసెంబర్ నెలలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఆర్అండ్‌బి ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
