అందుబాటులోకి తెచ్చిన మంత్రి పొన్న ప్రభాకర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కొండాపూర్ సమీపంలోని గోమాత జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) 12 రాష్ట్రాల్లో కపాస్ కిసాన్ (Kapas Kisan) మొబైల్ యాప్ కింద ఆన్‌లైన్ ద్వారా ఏ జిన్నింగ్ మిల్లు (Ginning Mill) ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని చెప్పారు. తద్వారా మనకు తేదీ స్లాట్ ఇస్తారని చెప్పారు. తెలంగాణలో తొలి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించామని పేర్కొన్నారు.

పత్తి మద్దతు ధర రూ.8100 ఉందని, ఈసారి భారీ వర్షాల వల్ల కొంత తక్కువగా ఉందని అన్నారు. పొన్నం ప్రభాకర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. కపాస్ కిసాన్ అనే రాజ మార్గం ద్వారా పత్తిని అమ్ముకోవచ్చు. మొక్క జొన్న కూడా కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. సీఎం రేవంత్(CM Revanth), వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వరి, మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
అన్ని కొనుగోలు కేంద్రాలు రైతులకు వినియోగంలోకి వస్తాయి. 3 జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్‌లోనూ పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి. నిన్నే అక్కన్నపేటలో సన్ ఫ్లవర్ విత్తనాలు పంపిణీ చేశాం. నర్మేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రయల్ రన్ (Trail Run) ప్రారంభమైంది. ఆయిల్ పామ్, హార్టికల్చర్, సెరికల్చర్‌పై అవగాహన కలగాలని రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాం.

లాభాలు ఉంటే పంటలు వేయాలి. దాని వల్ల అధిక దిగుబడి వచ్చి రైతులకు లాభాలు రావాలి. రైతులు ప్రభుత్వం ఇస్తున్న అన్ని కార్యక్రమాలు పొందాలి. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తిచేసి పంట పొలాలకు నీళ్లు అందిస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
