మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు మధ్య పోటీ
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Election) ప్రచారంలో భాగంగా మీనాక్షిపురం (రహమత్ నగర్ ) చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు (Harsh comments) చేశారు. ఈ ఎలక్షన్.. హిందూ(Hindu), ముస్లిం(Muslim)ల మధ్య జరుగుతున్న వార్ (War) అని అన్నారు. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు మధ్య పోటీ అని పేర్కొన్నారు. బొట్టు పెట్టుకున్నోళ్లకు, బొట్టు లేనోళ్లకు మధ్య సమరమని చెప్పారు. 80 శాతం ఉన్న హిందువులు గెలుస్తారా? 20 శాతం ఉన్న ముస్లింలు గెలుస్తారా? అని ప్రశ్నించారు.
హిందువుల పక్షాన బీజేపీ (BJP) ఉందని, ముస్లింల పక్షాన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఉందని స్పష్టం చేశారు. ఖాన్ బేగం నగర్ కావాల్నా.. సీతారాం నగర్ కావాల్నా తేల్చుకోవాలని సూచించారు. తెలంగాణను ఇస్లామిక్ స్టేట్(Islamic State)గా మార్చేందుకే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. తెలంగాణలో హిందువులను ఓటు బ్యాంకుగా మార్చడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడిని కట్టిస్తా అని, అమిత్ షాను పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తానని వెల్లడించారు.
కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే మీ పార్కులు ఖబరస్తాన్లు, ఈద్గాలు, మసీదులుగా మారిపోతాయని హెచ్చరించారు. గణేష్, దసరా, హనుమాన్, శివాజీ జయంతి ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఉండదని అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని అంటున్న విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
