సంస్థాన్ నారాయణపురం, జనవరి 16(ఆదాబ్ హైదరాబాద్): ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంస్థాన్ నారాయణపురం మండలం చిమిరియాల సర్పంచ్(Sarpanch of Chimiriyala)గా ఉప్పల రమేష్(Uppala Ramesh) గెలిచిన నేపథ్యంలో పదో తరగతి మిత్రులు(Tenth Class Friends) ఆయన్ని శుక్రవారం ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి సత్కరించారు. తమ స్నేహితుడు సర్పంచ్ కావటం తమకెంతో గర్వంగా ఉందని తెలిపారు. ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, మంచి పరిపాలన అందించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని, ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ ఐదేళ్ల కాలంలో గ్రామ సమస్యలన్నీ పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని చెప్పారు.
మంచి పనులు చేసి అందరి మన్ననలు పొంది మరోసారి సర్పంచ్‌గా విజయం సాధించాలని, రాజకీయంగా మరిన్ని పెద్ద పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ తనను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా గ్రామ సమస్యలను తీర్చేందుకు అందరి సలహాలు, సూచనలు తీసుకుంటానని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల రమేష్, ఎం.శ్రీనివాస్, కొండ శ్రీను, రాపర్తి సురేష్, కె.కిషన్ నాగరాజు, సతీష్, ఎస్. రామ్ నరేష్ యాదవ్, వెంకటేష్, ఎస్.వెంకటేష్, యాదయ్య, శేఖర్, బుగ్గ రాములు, కె.లింగస్వామి, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

