Tuesday, February 10, 2026
Homeసాహిత్యంJatara | సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం జాతరలు

Jatara | సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం జాతరలు

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లోని పల్లె పల్లెలో పలు జాతర(Jatara)లు జరుగుతాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రెండు జాతరలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఒకటి.. మేడారం(Medaram) జాతర. రెండు.. నాగోబా(Nagoba) జాతర. ఇవి.. కోడి పందేలు, జూదం, పేకాట, అశ్లీల నృత్యాలు, హోరెత్తించే గీతాలు, పందెంరాయుళ్లు, బెట్టింగ్ బంగార్రాజులు, అల్ట్రా కల్చర్‌కు భిన్నంగా తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని(Cultural Splendor) చాటి చెప్పేలా జరుగుతున్నాయి.

మేడారం జాతర

- Advertisement -

సమ్మక్క సారలమ్మ జాతర.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. దేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మక జాతర జరుగుతుంది.

సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలుగా, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే కాక యావద్దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనత వహించిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

నాగోబా జాతర

ఏటా పుష్యమాసం అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. సర్ప జాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. పుష్య మాసం అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య రోజు సరిగ్గా రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా గోండుల దేవుడు.

నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ జనాభా 400కు మించదు. కానీ పండగ రోజు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం.

సర్ప రూపంలోని నాగేంద్రుడికి అతని తల్లి రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించింది. దీంతో ఆ ఊరు ఉడుంపూర్ అయింది. ఆ తర్వాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకో అనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తర్వాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరి గోదావరిలో సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం.

ఆ తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటను నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని(భేటీ కోరియాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెబుతుంటారు. అదే.. కెస్లాపూర్‌ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. మేస్రం వంశం కిందికి 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా పేరొందింది.

  • డాక్టర్ వెన్నెల గద్దర్, చైర్ పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి
- Advertisement -
RELATED ARTICLES

Latest News