- 12 లక్షలు స్వాధీనం.అదుపులో నలుగురు.
- ఐదు నకిలీ బంగారం బిస్కెట్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం.
- తక్కువ ధరకు బంగారం పేరుతో భారీ మోసం.
- కేసును చేదించిన సూర్యాపేట రూరల్ పోలీసులు.
- మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ.
తక్కువ ధరకే బంగారం వస్తుందని చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ బంగారం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 6న హనుమకొండకు చెందిన సూర్యనేని వెంకటేశ్వర్లు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ.12 లక్షలు తీసుకుని నకిలీ బంగారం ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు. దానిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.హుజూర్‌నగర్‌కు చెందిన ఇర్రి నరేష్‌కు అతని స్నేహితుడు సుధాకర్ ఫోన్ చేసి నాగేశ్వరరావు అనే వ్యక్తి తక్కువ ధరకే బంగారం అమ్ముతాడు అని తెలిపాడు.

నకిలీ బంగారాన్ని నిజమైనదిగా చూపుతూ ముఠా వ్యాపారం కోసం నరేష్‌ను వలలో వేయగా, అతడు కూడా మధ్యవర్తిగా మారి కన్నయ్య అనే వ్యక్తిని కలిపి డీల్ జరిపే ప్రయత్నం చేశాడు.తర్వాత కన్నయ్య ద్వారా హనుమకొండకు చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మి, మామిడి లీలా లను సూర్యాపేటకు రప్పించారు. డిసెంబర్ 6న మధ్యాహ్నం 3 గంటలకు సూర్యపేటలోని 7 హోటల్ సమీపంలో సుధాకర్, నారాయణ, శ్రీనివాస్‌రావు, యోగిరెడ్డి, నాగిరెడ్డి, చంద్ర లు వచ్చి 12 లక్షల రూపాయలు చూసి బాలేంల గ్రామంలోని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నాగేశ్వరరావు, రాజారాం, మూర్తి డబ్బులు తీసుకుని 5 నకిలీ బిళ్లలు ఇచ్చాడు. మిగతా బిళ్ళలు తర్వాత ఇస్తామన్నారు.

ఉచ్చులో చిక్కిన ముఠా:
డిసెంబర్ 8న నాగేశ్వరరావు, నరేష్‌ను మళ్లీ ఫోన్ చేసి డబ్బులు తెమ్మని చెప్పగా, నిందితులు కారులో సూర్యాపేట రూరల్ పరిధిలోని బాలేంల ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో రూరల్ పోలీసులు కారు వద్ద నిలబడి ఉన్న నలుగురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మిగతావారు కారు లో పారిపోయారు.తర్వాత నలుగురి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా రూ.12 లక్షల నగదు, 5 నకిలీ బంగారు బిళ్ళలు, 4 సెల్‌ఫోన్లు లభించాయి. నిందితులుగా ఇర్రి నరేష్, మేడి ఆది నారాయణ, కుందూరు యోగిరెడ్డి, పిట్ట నాగేంద్ర రెడ్డి పేర్లు వెల్లడయ్యాయి. మిగతా నిందితులు నాగేశ్వరరావు, బాల, శ్రీనివాస్‌రావు, చంద్ర, సుధాకర్ ఇంకా పరారీలో ఉన్నారని తెలిపారు. కేసు ఛేదనలో చురుగ్గా పనిచేసిన సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్, హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్, కానిస్టేబుల్స్ చైతన్య, ఉమామహేశ్వర్, హోంగార్డ్ సాయి శంకర్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.
