Sunday, October 26, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంSAKHI | సఖిలో నకిలీ ఉద్యోగుల దందా

SAKHI | సఖిలో నకిలీ ఉద్యోగుల దందా

  • సఖి సెంటర్లలలో బంధువుల పేర్లతో ప్రభుత్వ జీతాలు కాజేస్తున్న ఏజెన్సీలు!
  • జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సఖి ఏజెన్సీలు కుమ్మక్కై దోపిడీ!
  • మహిళా శిశు సంక్షేమ శాఖలో బోగస్ ఉద్యోగుల హల్ చల్..
  • నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలలో సగం నకిలీలేనట!
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బాగోతం..

పెరుమాళ్ళ నర్సింహారావు మహిళల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వంచే ఏర్పాటైన ‘సఖి’ వన్స్టాప్ సెంటర్లు ఇప్పుడు అవినీతి కేంద్రాలుగా మారుతున్నాయి. హింసకు గురైన మహిళలకు పోలీసు, వైద్యం, న్యాయం, కౌన్సెలింగ్ మరియు ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందిస్తాయి. ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో ‘సఖి’ సెంటర్ ను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటాధనం నిధులు ఇవ్వగా, 40 శాతం వాటాధనం రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని 100 శాతం నిధులు ఈ సఖి సెంటర్లు నిర్వహిస్తున్న ఏజెన్సీలు/ ఎన్జీఓలకు విడుదల చేస్తున్నాయి. 2015లో ప్రారంభం అయిన ఒక్కో సఖి సెంటర్లలో సుమారు 10-15 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. సదరు ఉద్యోగులను ఆయా ఏజెన్సీలే నియమించుకుంటాయి. ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు మొదట నుండి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంతో ఏజెన్సీలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, సఖి సెంటర్లను ప్రస్తుతం తమ కలెక్షన్ సెంటర్లుగా మార్చుకున్నట్లు విమర్శలు వినపడుతున్నాయి.

సఖి సెంటర్లలలో బంధువుల పేర్లతో ప్రభుత్వ జీతాలు కాజేస్తున్న ఏజెన్సీలు!

అర్హత లేని ఎంతోమందిని కౌన్సిలర్లుగా నియమించుకున్నారని, ఒక్కో సెంటర్ లో 24 గంటల సహాయక చర్యల కోసం ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సిన చోట ఒకే డ్రైవర్ ను పెట్టి, రెండవ డ్రైవర్ ప్లేసు లో ఒక బోగస్ పేరును రాసుకొని సదరు ప్రభుత్వ జీతాన్ని ఏజన్సీలు కొన్ని ఏండ్లుగా నొక్కేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న మూడు ‘సఖి’ సెంటర్లలో కొన్ని ఏజెన్సీలు తమ బంధువుల పేర్లను ఉద్యోగులుగా చుపిస్తూ, ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఇందులో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు మినహాయిస్తే, మహిళల భద్రత, సంక్షేమం కోసం ఒక్కో సెంటర్ కు ప్రభుత్వం నెలకు సుమారు 2 లక్షల వరకు కేటాయించడం జరుగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 సఖి సెంటర్లలో పలు జిల్లాల్లో ఏజెన్సీలు అవినీతికి పాల్పడడటంతో కొన్ని జిల్లాల సెంటర్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారే స్వయంగా నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్లలో ఉద్యోగుల జీతభత్యాలు కూడా సదరు శాఖనే చెల్లిస్తోంది. మిగిలినవి ఇంకా ఆయా ఏజెన్సీల చేతిలోనే ఉన్నాయి. ఈ ఏజెన్సీలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఉద్యోగుల జీత భత్యాలు నెలలకొద్దీ ఆలస్యం అవుతున్నా, ఎలా నెట్టుకొస్తున్నారో అర్ధం కావడం లేదు. సఖి సెంటర్లు నడుపలేని ఏజెన్సీలు ప్రభుత్వానికి అప్పగించాలని ప్రభుత్వం కోరినా కూడా సదరు ఏజెన్సీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఏజెన్సీలు నడుపుతున్న సఖి సెంటర్లలో సగం వరకు బోగస్ ఉద్యోగులే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారిస్తే, అనేకమంది బోగస్ ఉద్యోగులు బయటపడే అవకాశం ఉంది.

జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సఖి ఏజెన్సీలు కుమ్మక్కై దోపిడీ!

కొద్దిమంది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ఆయా జిల్లాలలో ఉన్న సఖి సెంటర్ల ఏజెన్సీలతో చేతులు కలిపి, ప్రభుత్వ నిధులను కాజేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాలలో సగానికి సగం బోగస్ ఉద్యోగులను చూపుతూ, నకిలీ రికార్డులు తయారుచేసి, జీతాల పేరుతో అక్రమంగా ప్రజాధనాన్ని నెలవారీగా దోపిడీ చేస్తున్న వైనం సిరిసిల్ల జిల్లాలో బయటకు వచ్చింది. దీంతో అక్కడి అధికారులు 10 మంది ఉద్యోగులను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇది సిరిసిల్ల జిల్లాకే పరిమితం కాదు. ఏజెన్సీల చేతుల్లో ఉన్న అన్ని జిల్లాలలోని సఖి సెంటర్లలో ఇదే బాగోతం కొనసాగుతోంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఏసీబీ విచారణ చేపడితే, వందలాదిమంది బోగస్ ఉద్యోగులు బయటికి వచ్చే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులే తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలలో ప్రభుత్వం బోగస్ ఉద్యోగుల ఏరివేతను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అధికారులు ఆయా జిల్లాలో ‘సఖి’ సెంటర్ల నిర్వాహకులపై దృష్టి సారిస్తే అనేకమంది నకిలీ ఉద్యోగుల బాగోతం బయటపడే అవకాశం లేకపోలేదు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News