- 9 లక్షల విలువైన నకిలీ నోట్లు..
- షాక్ కు గురైన పోలీసులు..
- పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభం..
- భరత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..
బలోత్రా జిల్లాలో మొబైల్ రిపేర్ దుకాణదారుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. దుకాణదారుడు తొలిసారి ఈ నకిలీ నోట్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టడమే కాకుండా, ఇంతకుముందు కూడా రూ.40 లక్షల నకిలీ కరెన్సీని చలామణి చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీసులు ఈ నకిలీ కరెన్సీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బలోత్రాలోని గాంధీపుర ప్రాంతానికి చెందిన భరత్ మాలి నకిలీ నోట్లను విక్రయిస్తున్నట్లు సమాచారమందడంతో, జసోల్ పోలీసులు దాడి చేపట్టారు. ఈ దాడిలో రూ.500 చొప్పున 1795 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, మొత్తం రూ.8 లక్షల 97 వేల 500 విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. నకిలీ కరెన్సీ వ్యాపారాన్ని నడుపుతున్న భరత్‌ని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో భరత్, జలోర్‌లోని వ్యక్తి ద్వారా ఈ నకిలీ నోట్లను కొనుగోలు చేసి, అహ్మదాబాద్‌లో వాటిని చలామణి చేస్తున్నట్టు వెల్లడించాడు. అతనికి బలోత్రాలో పాత బస్టాండ్ వెనుక మొబైల్ రిపేర్ షాప్ ఉందని, అది తరచూ మారుస్తూ ఉండేవాడని పోలీసుల చెబుతున్నారు.
భరత్ స్మార్ట్‌గా అహ్మదాబాద్, సూరత్‌లకు మాత్రమే సరఫరా చేయడంతో బలోత్రాలో తనపై ఎలాంటి అనుమానం రాకుండా చూసేవాడు. ప్రాథమిక విచారణలో అతను మరింత సమాచారం అందిస్తూ, ఈ నకిలీ కరెన్సీ వెనుక ఉన్న నెట్‌వర్క్ గురించి కొన్ని పేర్లను బయటపెట్టాడు. భరత్‌కు నకిలీ నోట్లను సరఫరా చేసిన జలోర్ యువకుడితో పాటు, నోట్ల ప్రింటింగ్ స్థలాలను కూడా పోలీసులు మరింతగా విచారిస్తున్నారు.
